పునరావాసం ఎక్కడ సారూ? | - | Sakshi
Sakshi News home page

పునరావాసం ఎక్కడ సారూ?

Mar 17 2025 3:17 AM | Updated on Mar 17 2025 9:44 AM

కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్‌ 41.15 కాంటూర్‌ పరిధిలోని నిర్వాసిత గ్రామాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారాన్ని జమచేసిన ప్రభుత్వం వచ్చే జూన్‌ కల్లా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో పనులు వేగవంతం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆప్షన్‌ 2 ను ఎంచుకున్న నిర్వాసితులకు ఇంతవరకు స్థలాలను అప్పగించలేదని ఉన్నట్టుండి గ్రామాలను ఖాళీ చేయమంటే తమ పరిస్థితి ఏంటని కొందరు నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.

స్థలం ఇవ్వనేలేదు.. ఖాళీ చేయమంటే ఎలా

పోలవరం ప్రాజెక్ట్‌ 41.15 కాంటూర్‌ పరిధిలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు గతంలో సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారానికి సంబంధించి నిర్వహించిన గ్రామసభలో నిర్వాసితుల వద్ద నుంచి ఆప్షన్‌ 1, ఆప్షన్‌ 2, ఆప్షన్‌ 3 కింద దరఖాస్తులను స్వీకరించింది. ఆప్షన్‌ 1 ఎంచుకున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం చెల్లించి ఇంటి నిర్మాణం ప్రభుత్వేమే చేపట్టి ఇస్తుంది. ఆప్షన్‌ 2 ఎంచుకున్న నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ఖర్చయితే చేస్తుందో ఆ మొత్తాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమచేస్తుంది. ఇంటి నిర్మాణాన్ని నిర్వాసితుడే చేపట్టుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్‌ 3 ఎంచుకున్న వారికి ఇళ్లు, స్థలం రెండు వద్దనుకున్నారు కనుక వారికి ఆర్‌అండ్‌ఆర్‌తో పాటు ఆ రెంటికి అయ్యే ఖర్చును నిర్వాసితుల ఖాతాల్లో జమచేస్తుంది. ఈ విధంగానే ఇటీవల ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. అయితే ఆప్షన్‌ 2 ను ఎంచుకున్న నిర్వాసితులకు ఇంతవరకు స్థలాలను స్థలాలను అప్పగించలేదు. దీంతో జూన్‌ కల్లా నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే ప్రక్రియ చేపడితే స్థలాలను అప్పగించకుండా ఇంటి నిర్మాణం చేసుకోకుండా అప్పటికప్పుడు గ్రామాలను ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని ఆప్షన్‌ 2కు దరఖాస్తు చేసుకున్న నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు తమకు స్థలాలను అప్పగిస్తే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకుంటామని ఆప్షన్‌ 2 నిర్వాసితులు కోరుతున్నారు.

జూన్‌ కల్లా నిర్వాసితులను తరలించేందుకు ప్రభుత్వం చర్యలు

నేటికీ ఆప్షన్‌ 2 నిర్వాసితులకు స్థలాలు చూపించని వైనం

స్థలాలు అప్పగించండి

నేను కుక్కునూరు ఏ బ్లాక్‌ నిర్వాసితుడిని. ఆర్‌అండ్‌ఆర్‌ గ్రామ సభలో ఆప్షన్‌ 2 కు దరఖాస్తు చేసుకున్నాను. అయితే పునరావాస కాలనీల్లో నాకు కేటాయించిన స్థలానికి సంబంధించి పట్టాను అధికారులు అందించారు. కాని ఇంతవరకు నా స్థలం ఎక్కడుందో చూపించలేదు. మా స్థలాలను అప్పగిస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటాం. అప్పటికప్పుడు ఇళ్లను ఖాళీ చేయమంటే మేము ఉన్నట్టుండి ఎక్కడికెళ్లాలో అధికారులే ఆలోచించాలి.

– వినపాల ప్రభాకర్‌, నిర్వాసితుడు, కుక్కునూరు

పునరావాసం ఎక్కడ సారూ? 1
1/2

పునరావాసం ఎక్కడ సారూ?

పునరావాసం ఎక్కడ సారూ? 2
2/2

పునరావాసం ఎక్కడ సారూ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement