నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండురోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన సాంస్కృతిక సంబరాల వేడుక సిగ్నస్–25 శనివారం రాత్రి ముగిసింది. మరుగున పడుతున్న సంస్కృతి సంప్రదాయాలను భావి తరాల వారికి తెలపడమే లక్ష్యంగా సిగ్నస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిస్టర్ అండ్ మిస్ ఆర్జీయూకేటీ, కిచెన్ క్రానికల్, సినీవేర్స్, కాన్వాస్ ఆఫ్ హెరిటేజ్, రంగోలీ ఆర్ట్ ఫెస్ట్ తదితర పోటీలను నిర్వహించారు. విద్యార్థులు వినోదకరమైన గేమ్ స్టాల్స్ ఏర్పాటు చేసి క్యాంపస్ మొత్తం ఉల్లాసకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. అంతేగాకుండా సంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించి ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సంబరాల్లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌చే నిర్వహించబడిన నవదుర్గ–అష్టలక్ష్మి నృత్యప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనతో శక్తి, భక్తి, కళా వైభవం ఉట్టిపడింది. మిస్టర్ ఆర్జీయూకేటీగా యశ్వంత్‌కుమార్ , మిస్ ఆర్జీయూకేటీగా రిష్పా నిలిచారు. తోలుబొమ్మలాట నిర్వహించి అనాదిగా వస్తున్న కళను నేటి విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. దీనికిగాను కాకినాడకు చెందిన తోట బాలకృష్ణమూర్తి బృందం రామాయణంలోని సుందరకాండను ప్రదర్శించారు. అనంతరం బాలకృష్ణమూర్తి బృందాన్ని అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ బీ లక్ష్మణరావు, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి, డీన్ అకడమిక్స్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.