ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు మైనార్టీ నాయకులను వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ విభాగంలో పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు చెందిన మహమ్మద్ జహీర్‌ను పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమించారు. ఎస్‌కే సయ్యద్‌బాజీ (గాజుల బాజీ)ని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీవారికి వైభవంగా డోలా పౌర్ణమి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం డోలా పౌర్ణమి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరులతో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ముందుగా ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా తిరువీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించి, భక్తిప్రపత్తులను చాటారు.
బాలల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ఏలూరు (టూటౌన్): బాలల చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఏలూరు వన్‌టౌన్ ఏరియాలో ఉన్న హోటల్ ఆదిత్య సెంట్రల్‌లో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ – క్రాఫ్ ఆధ్వర్యంలో బాలలతో ముఖాముఖీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ క్రాఫ్ సిబ్బంది బాలల న్యాయ చట్టాల గురించి వివరించడమే కాకుండా బాలల సమస్యలను గుర్తించి అధికారులకు తెలియజేసేలా ప్రోత్సహించడం మంచి ఆలోచన అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బాలల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ విధమైన ఉచిత న్యాయ సలహాలు కావాలన్నా మండల స్థాయిలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు.
కేంద్రీయ విద్యాలయం స్థలం పరిశీలన
నూజివీడు: కేంద్రీయ విద్యాలయానికి ట్రిపుల్ ఐటీ సమీపంలో గత ప్రభుత్వం కేటాయించిన ఏడెకరాల స్థలాన్ని శుక్రవారం కేంద్రీయ విద్యాలయానికి చెందిన అధికారులు పరిశీలించారు. కేంద్రీయ విద్యాలయం ఏలూరు ప్రిన్సిపాల్ బీఎస్ మీనా, ఈఈ కిశోర్, డీఈ కృష్ణమోహన్ నూజివీడు విచ్చేసి మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట రామిరెడ్డితో వెళ్లి పరిశీలించారు. స్థలంలో ఉన్న పిచ్చి చెట్లు, ముళ్లకంపను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు తెలిపారు. ఎలాంటి ముళ్ల చెట్లు లేకుండా అప్పగిస్తే అందులో శాశ్వత భవనాల నిర్మాణానికి ముందడుగు పడుతుందన్నారు. తహసీల్దార్ బీవీ సుబ్బారావు, ఆర్‌ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులకు పదవులు