శాంతి మంత్రం – సమర శంఖం

Ukraine pitches peace conference even as Russia issues threat - Sakshi

లాగే కొద్దీ ముడి బిగుసుకుంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇప్పుడు అలాగే తయారైంది. మరికొద్ది రోజుల్లో ఏడాది మారిపోయి, రెండో క్యాలెండర్‌ సంవత్సరంలోకి ఈ సంక్షోభం అడుగుపెడుతోంది. ఇప్పటికీ పరిష్కారం కనిపించడం లేదు. ఇరు దేశాధినేతలూ ఒకరోజు శాంతి మంత్రం పఠిస్తున్నారు. ఆ వెంటనే సమర శంఖం పూరిస్తున్నారు. చర్చలకు సిద్ధమని రష్యా అధినేత పుతిన్‌ ఆదివారం అన్నారో లేదో, మర్నాడే మాస్కో ప్రతిపాదనలకు అంగీకరిస్తే సరే... లేదంటే ఈ వ్యవహారాన్ని తమ సైన్యం తేలుస్తుందంటూ రష్యా విదేశాంగ మంత్రి హూంకరించారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం శాంతికి సిద్ధమంటూనే, అగ్రరాజ్యాల నుంచి ఆయుధాల సమీకరణకు తిరుగుతున్నారు. ఇటు రష్యా మంకుపట్టు, అటు పాశ్చాత్య దేశాల అండతో ఉక్రెయిన్‌ దుస్సాహసం – వెరసి ప్రపంచానికి పీటముడిగా మారింది.  ఇటీవలే అమెరికా అధ్యక్షుణ్ణి కలిసొచ్చిన జెలెన్‌స్కీ సోమవారం భారత ప్రధానికి చేసిన ఫోన్‌ ఆసక్తి రేపింది. నవంబర్‌లో బాలిలో జీ20 సదస్సులోనే ఆయన ‘శాంతికి సూత్రాలు’ అంటూ 10 అంశాలు ముందుకు తెచ్చారు.

ఆ దశసూత్ర ప్రణాళికను అమలు చేయాలంటూ డిసెంబర్‌ 1 నుంచి ఏడాది కాలానికి జీ20కి అధ్యక్ష హోదా దక్కిన భారత్‌ను తాజా ఫోన్‌కాల్‌లో అభ్యర్థించారు. అణ్వస్త్రాల నుంచి రక్షణ, ఆహార భద్రత, ఖైదీల విడుదల, ఐరాస నిబంధనావళి అమలు, రష్యా సైన్యాల ఉపసంహరణ – ఇలా పది అంశాల సమాహారం ఆయన శాంతి ప్రణాళిక. వచ్చే 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగాలి. దానికి అజెండాను సిద్ధం చేస్తూ, వివిధ దేశాలతో భారత్‌ సంప్రతిస్తున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ శాంతిస్థాపన బాధ్యతను భారత భుజంమీదికి నెట్టారు.  

నిన్నటిదాకా జీ20కి సారథ్యం వహించిన ఇండోనేసియా అధ్యక్షుడు మాస్కో, కీవ్‌లకు వెళ్ళి మాట్లాడారు. కానీ, ఉక్రెయిన్‌ యుద్ధానికి తెర పడలేదు. ఇప్పుడు జీ20 పగ్గాలు పట్టిన భారత్, మిత్రదేశం రష్యాతో తనకున్న సుదీర్ఘ స్నేహసంబంధాల రీత్యా ఏదన్నా ఇంద్రజాలం చేయగలదా? యుద్ధానికి ముగింపు పలకగలదా? జీ20 సారథ్యానికి సంతసిస్తున్న భారత్‌కు ఉక్రెయిన్‌ అభ్య ర్థనలో తప్పు లేదు.

అయితే, రష్యా సహా అందరికీ ఆ శాంతి ప్రణాళిక ఆమోదయోగ్యమేనా అన్నది ప్రశ్న. ఏకపక్ష, నామమాత్ర ప్రతిపాదనలతో ప్రయోజనం లేదు. అలాగే, జీ20 అధ్యక్ష హోదాలో ఉన్నా అంతా భారత్‌ నిర్ణయమే ఉండదు. పైగా, ఆహార, ఇంధన భద్రతపై వర్ధమాన దేశాలకున్న ఆందోళనలపై గళం విప్పడమే ఆ వేదిక కీలకప్రాధాన్యాలు. అదే మోదీ గుర్తు చేయాల్సొచ్చింది. 

ఎప్పటిలానే భారత్‌ సైతం రష్యా, ఉక్రెయిన్‌లు శత్రుత్వాలను తక్షణం విడిచి, చర్చలకు దిగాలనీ, దౌత్య విధానంలో అభిప్రాయ భేదాలకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాలనీ హితవు పలికింది. శాంతి చర్చలకు అండగా ఉంటాననీ, దెబ్బతిన్న సామాన్య ప్రజలకు మానవతా సహాయం కొనసాగిస్తాననీ హామీ ఇచ్చింది. అక్టోబర్‌ 4న జెలెన్‌స్కీకి ఫోన్‌లో ఇచ్చిన అవే హామీలను మోదీ పునరుద్ఘాటించారు. రష్యాతో స్నేహాన్ని వదులుకోవడం కానీ, అమెరికాను మరీ దూరం పెట్టడం కానీ ఏదీ వ్యూహాత్మకంగా భారత్‌కు సరి కాదు. అందుకే, సమతూకపు మాటలతో కత్తి మీద సాము చేస్తున్నాం.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నేటికీ ఖండించకున్నా, చర్చలే పరిష్కారమన్న మాటను పదే పదే వల్లె వేస్తున్నాం. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన 20 దేశాల జీ20 అధ్యక్ష పీఠం భారత్‌కు రావడంతో ఇప్పుడు సాముగరడీ సంక్లిష్టమైంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్‌ తటస్థ వైఖరినే అవలంబిస్తోంది. ప్రపంచవ్యాప్త ఆహార, ఇంధన కొరతల వేళ దౌత్య మార్గంతోనే కథ సుఖాంతమవుతుందని చెబుతోంది. ఇంధన కొరతతో తాము ఇరుకునపడితే, చిరకాల మిత్రుడైన రష్యా నుంచి తగ్గింపు ధరకే భారత్‌ చమురు దిగుమతి నచ్చని పాశ్చాత్య దేశాలు విమర్శలకు దిగుతున్నాయి.

భారత్‌ మటుకు దేశ ప్రజల అవసరాలే తనకు ప్రాథమ్యమంటోంది. ఎవరెన్ని ప్రవచనాలు, ప్రణాళికలు చెప్పినా ముందుగా ఇరుపక్షాల సందేహాలు వదిలించి, శాంతి చర్చలకు రప్పించడం కీలకం. రష్యా దురాక్రమణ తప్పే. ఉక్రెయిన్‌ కష్టం, నష్టం నిజమే. కానీ, సోవియట్‌ విచ్ఛిత్తి తర్వాత ఆడిన మాట తప్పి, తూర్పు ఐరోపా దేశాలను నాటోలో చేర్చుకొని, మాస్కోకు ముప్పు తెచ్చిన పాశ్చాత్య వైఖరీ సమర్థనీయం కాదు. 

శాంతి నెలకొనాలంటే సొంత ప్రయోజనాల్ని పక్కనపెట్టక తప్పదు. ఉక్రెయిన్‌ను సైతం తమ కూటమిలో చేర్చుకోవాలని చూస్తున్న పాశ్చాత్య ప్రపంచం రష్యాకున్న భద్రతాపరమైన ఆందోళ నల్ని తీరిస్తేనే శాంతి సాధనలో అడుగు ముందుకు పడుతుంది. రష్యా సైతం ఒకప్పటి తన యూని యన్‌లో భాగమైన ఉక్రెయిన్‌ను సమరాని కన్నా స్నేహంతో అక్కున చేర్చుకోవడం మేలు. ఇప్పటికే సైనికంగా, ప్రపంచంలో ఏకాకి అవుతూ ఆర్థికంగా దెబ్బతిన్న మాస్కో ఆధిక్యం సాధించడం కష్టమే. శీతకాలం మరిన్ని కష్టాలు తెస్తుంది.

కీవ్‌కు కలిసొస్తుంది. కానీ, విద్యుత్‌ గ్రిడ్లు, నీటి సరఫరాలపై రష్యా దాడి చేస్తోంది. ఇప్పటికే లక్షలమంది కరెంట్‌ లేక కష్టపడుతున్నారు. అగ్ర రాజ్యపు అండతో, రానున్న కాలంలో రష్యా బలహీనపడుతుంది లెమ్మని ఎగిరిపడితే ఉక్రెయిన్‌కీ తీరని నష్టమే. వచ్చే 2023లో ఈ సుదీర్ఘ రాజకీయ, ఆర్థిక, సైనిక యుద్ధంలో మలుపులపై విశ్లేషకుల్లో ఎవరి అంచనా వారికుంది. చివరికిది అణ్వస్త్ర, మూడో ప్రపంచ యుద్ధానికీ దారి తీస్తుందనే ఆందోళనా ఉంది. ఇరు వైపులా సామాన్యులే నష్టపోయే సమరోత్సాహానికి స్వస్తి చెప్పి, శాంతి చర్చల్ని స్వాగతిస్తేనే మేలు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top