Karnataka Assembly Elections 2023: కర్ణాటకంలో కథానాయకుడెవరు..?

Sakshi Editorial On Karnataka Assembly Elections 2023

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రోజుల క్రితం మొదలైన టికెట్ల పంపిణీ పర్వం ఎప్పటిలాగే ప్రధాన పక్షాల్లో ముసలం పుట్టిస్తోంది. సహజంగానే కాంగ్రెస్, జేడీ(ఎస్‌)ల కన్నా అధికార బీజేపీకే అసంతృప్తి తాకిడి ఎక్కువుంది. నాలుగేళ్లనాడు గోడదూకుళ్లతో అధికారంలోకొచ్చినందుకు ఇది ఆ పార్టీకి అనివార్యం. రాష్ట్రంలో తనవల్లే బీజేపీకి అధికారం సాధ్యమైందనుకునే పార్టీ నేతలు, ఫిరాయింపు నేతలు చాలామందే ఉండటం ఇందుకు కారణం. నాయకత్వం ఎంతో ఊగిసలాడి, ఎన్నికల్లో ఏమవుతుందోనన్న లెక్కలేసుకుని చివరకు 17 మంది ఫిరాయింపుదారుల్లో 14 మందికి టిక్కెట్లు ఇవ్వక తప్పలేదు.

224 అసెంబ్లీ స్థానాలుంటే బీజేపీ ఇంతవరకూ రెండు జాబితాల్లో 212 మందికి టిక్కెట్లిచ్చింది. ఈ రెండు జాబితాలతోనే దాదాపు 30 స్థానాల్లో తిరుగుబాటు జెండాలు పైకిలేచాయి. 18 మంది సిట్టింగ్‌లకూ, డజను మందికి మించి మాజీ ఎమ్మెల్యేలకూ ఈ జాబితాల్లో చోటు దక్కలేదు. మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌కు టికెట్‌ వస్తుందో రాదో ఇంకా తేలలేదు. సీనియర్‌ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ఆగ్రహంతో ఉన్నారని తొలుత వార్తలొచ్చినా బెంగళూరులో అడుగుపెట్టి  అంతా బాగుందని ఆయన కితాబునివ్వటం బీజేపీకి ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం.

‘ఆయన ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నారంటే 50 స్థానాల్లో బీజేపీ కనుమరుగు కావటం ఖాయం’ అని యడ్యూరప్ప శిబిరంలోని ఎమ్మెల్యే ఒకరు అంతక్రితం హెచ్చరించారు. యడ్యూరప్ప 1983 మొదలుకొని ఏడు దఫాలు ప్రాతినిధ్యంవహించిన శివమొగ్గ జిల్లాలోని షికారిపురా స్థానంలో ఈసారి ఆయన కుమారుడు విజయేంద్రకు చోటు దొరికింది. యడ్యూరప్ప సామాజిక వర్గమైన లింగాయత్‌లకు 51 స్థానాలు కేటాయించారు. మాజీ ఉపముఖ్యమంత్రి, యడ్యూరప్ప అనుచరుడు, లింగాయత్‌ నేతల్లో ముఖ్యుడైన లక్ష్మణ్‌ సవాది టికెట్‌ దక్కకపోవటంతో కాంగ్రెస్‌లో చేరటం పార్టీకి నష్టమే.

ఇతర పార్టీలను కుటుంబ పార్టీలంటూ, కుల పార్టీలంటూ నిందించే బీజేపీ కుల సమీకర ణాలూ, కుటుంబ సమీకరణాలూ చూసుకుని టిక్కెట్లు ఇవ్వక తప్పలేదు. దక్షిణాదిలో బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా ఈ దఫా ఏలుబడిలో హిందూత్వ కార్డును బీజేపీ బలంగా ఉపయోగించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధం, ముస్లింలకున్న 4 శాతం కోటా రద్దు అందులో భాగమే. ముస్లింలకు రద్దుచేసిన కోటాను ప్రధాన కులాలైన లింగాయత్‌లకూ, వొక్కళిగలకూ చెరిసగం పంచారు. అందువల్ల ఆ రెండు ప్రధాన కులాల ఓట్లూ తనకే పడగలవని బీజేపీ విశ్వసిస్తోంది.

కర్ణాటకలో యడ్యూరప్ప నుంచి పెద్దగా ఒత్తిళ్లు లేకుండా టిక్కెట్ల వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించగలగటం అధిష్టానానికి ఇదే మొదటిసారి. అయితే పార్టీలో ఇన్నేళ్లుగా ప్రత్యామ్నాయ నాయకుడిని రూపొందించటంలో అధిష్టానం విఫలమైంది. బలమైన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడటం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితే. ముఖ్యమంత్రి బసవ రాజ్‌ బొమ్మై యడ్యూరప్పతో సరితూగే నేత కాదన్నది పార్టీలో అందరికీ తెలుసు.

సమస్యలు వచ్చిపడినప్పుడు ఉద్యమించటానికి బదులు ఎన్నికలప్పుడు అధికార పక్షంపై విమర్శలు గుప్పించటం కర్ణాటకలోని పార్టీలకూ అంటింది. ముఖ్యంగా హిజాబ్‌ నిషేధం, ముస్లింల కోటా రద్దు అంశంలో కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లు బలంగా తమ వాణి వినిపించలేకపోయాయి. ముస్లింలు అధికంగా ఉండే కోస్తా కర్ణాటకలోని 21 స్థానాల్లో కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లపై దీని ప్రభావం ఎలావుంటుందో వేచిచూడాలి. గత నెలాఖరులో విడుదలైన సీ–ఓటర్‌ సర్వే అయితే కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పింది. కానీ కాంగ్రెస్‌ దాన్ని నిజం చేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య ఎప్పుడూ పొసగదు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం చేస్తే తనకు అభ్యంతరం లేదని శివకుమార్‌ ఇటీవల చెప్పటం సిద్ధరామయ్య శిబిరానికి ఆగ్రహం తెప్పించింది. జేడీ(ఎస్‌)ది మరో వ్యథ. సమస్యలపై పోరాడాల్సిన సమయంలో ఆ పార్టీ వారసత్వ పోరుతో కొట్టుమిట్టాడింది. వొక్కళిగలు అధికంగా ఉన్న మైసూర్‌ ప్రాంతంలో జేడీ(ఎస్‌) బలంగానే ఉండేది. ఈసారి బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేనాటికైనా జేడీ(ఎస్‌) ఇంటిని చక్కదిద్దుకుంటుందో లేదో చూడాల్సివుంది. 

తాము ఓట్లేసి గెలిపించిన పక్షమే అధికారంలోకొస్తుందన్న గ్యారెంటీ లేని స్థితిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక ఈ జాడ్యం చాలా రాష్ట్రాలకు అంటినా కర్ణాటకది ప్రత్యేకమైన పరిస్థితి. అక్కడ స్వప్రయోజనాలు తప్ప సిద్ధాంత జంజాటం లేని నేతల సంఖ్య ఎక్కువే. కనుక అస్థిర రాజకీయాలు రివాజుగా మారాయి. ప్రజా భీష్టాన్ని తెలుసు కోవటమనే ప్రక్రియను విడనాడి, ప్రజాభీష్టాన్ని తయారు చేయటం కోసం ఎడతెగ కుండా శ్రమించే పార్టీల హవాయే ప్రస్తుతం ఎక్కువగా నడుస్తోంది. ఎన్నికలు నిర్వహించటంతోనే ప్రజాస్వామ్య కర్తవ్యం పరిపూర్తయిందని భావించటంకాక, ప్రజానీకం ఆశలు ప్రతిఫలించేలా... వారిలో ప్రజా స్వామ్య స్ఫూర్తి ఇనుమడించేలా ఏలుబడి సాగించటం ముఖ్యమని అన్ని పార్టీలూ గ్రహించటం అవసరం. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉంటుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top