మన అక్షరానికి పట్టాభిషేకం

Sakshi Editorial On Geetanjali Shree After Ret Samadhi Wins International Booker Prize

మన అక్షరానికి అంతర్జాతీయంగా దక్కిన అరుదైన గౌరవం. మనం ఇది గర్వించాల్సిన సందర్భం. అవును... భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీ రాసిన హిందీ నవల ‘రేత్‌ సమాధి’కి ఆంగ్లానువాదమైన ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకోవడం సాహితీ ప్రియులకు ఈ మండు వేసవిలో మామిడిపండు లాంటి తీపి కబురు. భారతీయ భాషలోని ఓ రచనకు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రప్రథమం. ఎనిమిది పదుల వయసులోని స్త్రీమూర్తి తన మూలాలు వెతుక్కుంటూ సాగించిన అన్వేషణ నేపథ్యంలో దేశ విభజన నాటి పరిస్థితులనూ, కాలం మాన్పని గాయాలనూ కళ్ళకు కట్టిన నవల ఇది. ప్రేమ, కష్టనష్టాలు, వాటి నుంచి విమోచన లాంటి జీవితంలోని భావోద్వేగాలను చిత్రీకరించిన ఈ నవలకు అత్యున్నత పట్టం కట్టాలని న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా తీర్మానించడం విశేషం. అనువదించి, అంతర్జాతీయ యవనికపైకి తీసుకొస్తే భారతీయ రచనలు ప్రపంచ సాహిత్య శ్రేణిలో నిలబెడతాయని మరోసారి రుజువైంది. 

ఢిల్లీకి చెందిన 64 ఏళ్ళ గీతాంజలిశ్రీ రాసిన హిందీ నవల ‘రేత్‌ సమాధి’ (ఇసుక సమాధి) నాలుగేళ్ళ క్రితం 2018లో ప్రచురితమైంది. తొమ్మిదేళ్ళ శ్రమ ఫలితమైన ఆ పుస్తకాన్ని మరో రచయిత్రి డైసీ రాక్‌వెల్‌ ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’గా ఇంగ్లీషులోకి అనువదించారు. అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ ద్వారా వారిద్దరికీ సంయుక్తంగా 50 వేల పౌండ్ల పారితోషికం దక్కుతుంది. నవల పేరు నుంచి పాత్రల దాకా అనేక అంశాలను ప్రతీకాత్మకంగా ధ్వనింపజేస్తుందీ రచన. భర్త మరణం తర్వాత ప్రపంచానికి దూరం జరిగిన తల్లి, పితృస్వామ్య శృంఖలాలను ఛేదించుకొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆమె కూతురు, ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో సర్వసాధారణంగా కనిపించే కోడలు – ఈ మూడు బలమైన స్త్రీ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ అది. ఓ ట్రాన్స్‌జెండర్‌ పాత్ర వీటికి అదనం. ఈ నవలలో ఇల్లు వదిలి మూలాలు వెతుక్కుంటూ వెళ్ళే మహిళ ఒకరైతే, ప్రపంచంలోని దేశదేశాల్లో సొంత ఇళ్ళున్న రిటైర్డ్‌ కస్టమ్స్‌ అధికారిణి మరొకరు. ఇలాంటి విరోధాభాసలతో పాఠకులకు ఎన్నో అంశాలను చెప్పకనే చెబుతారు రచయిత్రి. పేరుకు ఇది కాల్పనిక రచన అయినా, నవలలోని స్థల కాలాదులు, పాత్రలతో నిజజీవిత వ్యక్తులు, పరిస్థితులను స్ఫురింపజేస్తారు. 

దాదాపు 110 ఏళ్ళ క్రితం మన రవీంద్రనాథ్‌ టాగూర్‌ కవితా సంపుటి ‘గీతాంజలి’ సైతం ఇలాగే ఇంగ్లీషులోకి ‘సాంగ్‌ ఆఫరింగ్స్‌’ పేరిట అనువాదమైంది. సాహితీ రంగానికి గాను 1913లో నోబెల్‌ పురస్కారం అందుకుంది. ఒక రకంగా మళ్ళీ అలాంటి గర్వకారణమైన సందర్భం ఇది. ఎందుకంటే, ఇంగ్లీషులోనే నేరుగా రాసే నవలలకు ఏటా వార్షిక బుకర్‌ ప్రైజ్‌ ఇస్తారు. కానీ, ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ను మాత్రం రెండేళ్ళకు ఒకసారే ఇస్తారు. ఒకప్పుడు దీన్నే మ్యాన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌గా పేర్కొనేవారు. ఇంగ్లీషులోనే ప్రచురితమైన, లేదంటే ఇంగ్లీషు అనువాదం అందుబాటులో ఉన్న రచనల్లో అత్యుత్తమమైనదాన్ని ఎంపిక చేసి, ఈ పురస్కారం అందిస్తారు. గీతాంజలిశ్రీ ‘రేత్‌ సమాధి’ ఈ పురస్కారాన్ని తొలిసారిగా భారతీయ సాహిత్యాన్ని తెచ్చిపెట్టింది. గతంలో 5 నవలలు, 5 కథా సంపుటాలు వెలువరించిన గీతాంజలిశ్రీ పేరు ఈ తాజా పురస్కారంతో దేశమంతటా వినిపిస్తోంది. 

మతాలకూ, దేశాలకూ, చివరకు స్త్రీ పురుషులకూ మధ్య మనం సృష్టించుకున్న సరిహద్దులను ఆమె తన రచనలో ప్రతిఫలింపజేశారు. 80 ఏళ్ళ కథానాయకి పాత్ర ద్వారా సంప్రదాయాన్ని ఎదిరించి, హద్దులను చెరిపే మానవ స్ఫూర్తికి పట్టం కట్టారు. లౌకికవాద భావజాల రచనల గీతాం జలిశ్రీ, ఆమె రచనల్లోని భావ తీవ్రత సహజంగానే పాలక వర్గాల్లో కొందరికి రుచించకపోవచ్చు. విజేతను అభినందించడానికి సైతం వారికి నోరు పెగలకపోవచ్చు. అంతమాత్రాన విలువ తగ్గదు. 41 ఏళ్ళ క్రితం 1981లో ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌’ రచనతో సల్మాన్‌ రష్దీ బుకర్‌ ప్రైజ్‌ అందుకున్నారు. ఆ తరువాత అరుంధతీ రాయ్‌ (ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌), కిరణ్‌ దేశాయ్‌ (ది ఇన్‌హెరిటెన్స్‌ ఆఫ్‌ లాస్‌), అరవింద్‌ అడిగ (ది వైట్‌ టైగర్‌) ఈ పురస్కారం తెచ్చిపెట్టారు. ఆ వరుసలో మరో అడుగు ముందుకేసి గీతాంజలిశ్రీ తొలిసారి ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ సాధించారు. 

కాళిదాసు, భవభూతుల కాలం నుంచి భారతీయ సాహిత్యం విస్తృతమైనది, వైవిధ్యభరితౖ మెనది. మన ప్రాచీన సాహిత్య ఔన్నత్యానికి పాశ్చాత్యులు శిరసు వంచిన ఘట్టాలు అనేకం. సమ కాలీన భారతీయ సాహిత్యంలోనూ అనర్ఘ రత్నాలెన్నో. కానీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీల్లో వస్తున్న గొప్ప రచనలు ఆయా భాషల పరిధులు దాటి బాహ్యప్రపంచానికి చేరుతున్న సందర్భాలు ఇవాళ్టికీ అరుదు. ఈ తాజా అవార్డుతో మన భారతీయ భాషా సాహిత్యంపై మళ్ళీ విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేగుతుంది. అనువాదాలూ పెరిగే అవకాశమూ ఉంది. నిజానికి, అభ్యు దయ సాహిత్యాన్ని అనేక భాషల నుంచి తెలుగులోకి తెచ్చుకున్న మనం అన్నమయ్య నుంచి ఆధునిక సాహిత్యం దాకా మన సాహిత్యపు లోతులను అంతర్జాతీయ పాఠకులకు తగినంతగా చేరవేయలేదు. బుకర్‌ ప్రైజ్‌ నిర్ణేతల సారథి సైతం అనువాదాలు లేక, రాక ఎందరో భారతీయ రచయితల ప్రతిభ ప్రపంచానికి తెలియడం లేదన్నారు. అన్ని భాషల్లోనూ, ముఖ్యంగా తెలుగునాట సమర్థులైన ఆంగ్ల అనువాదకులు, ఆ అనువాదాలను ప్రోత్సహించే ప్రచురణకర్తల కొరత నేటికీ ఉంది. దాని నుంచి బయటపడేందుకు ‘రేత్‌ సమాధి’ నవల, దానికి దక్కిన బుకర్‌ ప్రైజ్‌ ఊతమిస్తుందని ఆశిద్దాం. అనువాద కళను ప్రోత్సహిస్తే, భారతీయ సాహిత్యానికి మరో నోబెల్‌ కల తీరినా ఆశ్చర్యం లేదు.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top