పాత కిరీటం – కొత్త సవాళ్ళు

Sakshi Editorial on France Emmanuel Macron Win in Elections

ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలలో ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ఎట్టకేలకు విజయం సాధించారు. అది ఆ దేశానికే కాక యూరప్‌కూ, మన దేశానికీ శుభవార్తే. పుతిన్‌కు సమర్థకురాలైన ఛాందసవాద, ప్రత్యర్థి మహిళా నేత మెరైన్‌ లీ పెన్‌ గెలిస్తే... ఫ్రాన్స్‌లో ప్రజాస్వామ్యం క్షీణిస్తుందనీ, యూరప్‌లో అశాంతి నెలకొంటుందనీ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంటుందనీ ఓ దశలో ఆందోళన వినిపించింది. అందుకే, యూరప్‌లో సుస్థిరత, శాంతి కోరుకుంటున్న వారందరికీ మళ్ళీ మెక్రానే గెలవడం ఓ తీపికబురు. ప్రజాస్వామ్య ఫ్రాన్స్‌కూ, పటిష్ఠమైన యూరప్‌కూ, భారత్‌ – ఫ్రాన్స్‌ల మధ్య మరింత పటిష్ఠ సంబంధాలకూ కీలక పరిణామం. అయితే, గడచిన అయిదేళ్ళలో ఫ్రాన్స్‌ అభివృద్ధి, సుస్థిరతపై దృష్టి పెట్టిన మెక్రాన్‌కు ఇప్పుడీ రెండో విడత అధ్యక్ష పదవి మరింత సవాలు కానుంది.  

ప్రత్యర్థిగా ఒక దశలో గట్టి పోటీ ఇచ్చిన లీ పెన్‌ ఓటమి అమెరికా సహా అనేక దేశాలకు పెద్ద ఊరట. పుతిన్‌ విధానాలను సమర్థించే ఆమె 2017లో రష్యాలో సైతం పర్యటించారు. ఉక్రెయిన్‌లో సుదీర్ఘంగా నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అనుకూల వైఖరి ఉన్న ఆమె గెలిచి ఉంటే, అది గొంతులో పచ్చి వెలక్కాయ అయ్యుండేది. ఉక్రెయిన్‌ వ్యవహారంలో రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా, ఐరోపా సమాజం (ఈయూ) చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలేది. పైపెచ్చు, ‘నాటో’, ఈయూ, అమెరికా అంటే ఆమెకు బొత్తిగా పడదు. అదీ కాక, ఆమె విజయం సాధిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్లు, ప్రపంచమంతటా ఇస్లామోఫోబియాకు ప్రోద్బలం లభించేదని పరిశీలకుల భావన. ఇస్లామ్‌ సహా మైనారిటీ వర్గాల పట్ల దుర్విచక్షణ లేని ఫ్రాన్స్‌లో సామరస్యపూర్వక సామాజిక చట్రమూ దెబ్బతినిపోయేదని వారి భయాందోళన. 

లీ పెన్‌కు కాకుండా మెక్రాన్‌కే ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తూ, ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ‘లా మోందే’ అనే దినపత్రికలో జర్మన్‌ ఛాన్సలర్‌ ఓలఫ్‌ షోల్జ్‌ ఏకంగా ఓ వ్యాసమే రాశారు. పొరుగు దేశపు రాజకీయాల గురించి ఇలా మరో దేశ నేత వ్యాసం రాయడం అసాధారణమే. అయితే, విమర్శలు వచ్చినా సరే యూరప్‌ భవిష్యత్తు పట్ల అక్కర చూపడమే ముఖ్యమని షోల్జ్‌ భావించారనుకోవాలి. భారత్‌ సంగతికొస్తే, మెక్రాన్‌ మళ్ళీ గద్దెనెక్కడం ఈ మండు వేసవిలో చల్లటి వార్త. పాశ్చాత్య దేశాలన్నిటిలోకీ ఇవాళ మన దేశానికి సన్నిహిత మిత్ర దేశం ఫ్రాన్సే. ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞాన సరఫరా సహా అనేక అంశాల్లో, రంగాల్లో మన దేశానికి ఫ్రాన్స్‌ కావాల్సినంత సాయం అందిస్తోంది. ఇరుదేశాలూ పరస్పర కీలక ప్రయోజనాలకు తగ్గట్లు సున్నితంగా వ్యవహరిస్తూ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయి. మన ప్రధానికీ, మెక్రాన్‌కూ మంచి దోస్తీ కూడా ఉంది. ఆ రకంగా తాజా ఎన్నికల ఫలితాలు మనకూ మంచివే.

చాలామంది కోరుకున్నట్టే చివరకు లీ పెన్‌ ఓడిపోయారు. వరుసగా మూడోసారీ ఆమెను అదృష్టం వరించలేదు. అయితే, ఇంతటితో కథ ముగిసిందనుకోవడానికి వీల్లేదు. తొలిసారి గెలిచిన ప్పుడు 68 శాతం ఓటు షేర్‌ తెచ్చుకున్న మెక్రాన్‌ ఇప్పుడీ రెండోసారి 58.5 శాతంతోనే తృప్తిపడాల్సి వచ్చింది. ఫ్రెంచ్‌ రాజకీయాలను ఛాందస వాదం వైపు నడిపించడంలో పెన్‌ కొంత విజయం సాధించారనే చెప్పాలి. 2017లో కేవలం 32 శాతం ఓటు షేర్‌ తెచ్చుకున్న ఆమె ఈసారి దాదాపు 42 శాతానికి బలం పెంచుకోవడం గమనార్హం. ఆమెకూ, ఛాందసవాదానికీ పెరుగుతున్న ఆమోద యోగ్యతకు ఇది తార్కాణం. అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ ధారణ పైన, వలస దారుల పైన నిషేధం లాంటి శ్రుతి మించిన ఆమె విధానాలను ఫ్రాన్స్‌ ఓటర్లు వ్యతిరేకించారన్న మాట. చివరకు తమ దేశపు ఆదర్శమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను నిలబెట్టారు. 

లీ పెన్‌ ఓటమితో అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి దృశ్యం ఫ్రాన్స్‌లో తప్పిపోయిందని విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. అదేమో కానీ, ఆమె విజయం సాధించి ఉంటే ఉక్రెయిన్‌ యుద్ధంలో ఫ్రాన్స్‌ వైఖరి మారిపోయి ఉండేదనడంలో సందేహం లేదు. నిజానికి, గత హయాంలో భారీగా పెరిగిన ధరలు, రిటైర్మెంట్‌ వయసు, మెక్రాన్‌ ‘ఉన్నతవర్గ ప్రవర్తన’ లాంటివన్నీ ఆయన ప్రాచు ర్యాన్ని అమాంతం కిందకు పడేశాయి. తీరా ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో రష్యా అధినేత పుతిన్‌ పట్ల ప్రబలిన వ్యతిరేకత సైతం ప్రత్యర్థి లీ పెన్‌కు ప్రతికూలంగా పరిణమించి, ఆ నెగిటివ్‌ ఓటింగ్‌ మెక్రాన్‌కు కలిసొచ్చింది. ఆ సంగతి ఆయనా ఒప్పుకున్నారు. తాజా ఎన్నికల్లో దాదాపు 28 శాతం మంది ఓటింగే చేయలేదు. మొన్న ఆదివారం ఓటింగుతో సౌకర్యవంతమైన ఆధిక్యం సాధించి, రాజకీయంగా గెలిచిన ఆయన ముందుగా మునుపటి సమస్యలను పరిష్కారించాల్సి ఉంటుంది. 

ర్యాడికల్‌ మధ్యేవాదాన్ని నమ్ముకొన్న ఈ మాజీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ రేపు జూన్‌లో రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో ఇటు వామపక్షవాదుల నుంచీ, అటు ఛాందస మితవాదుల నుంచీ గట్టి సవాలును ఎదుర్కోనున్నారు. ఆ ఎన్నికల్లోనూ ఆయన తన ఆధిక్యాన్ని నిలుపుకోవాల్సి ఉంటుంది. అసంతృప్త ఓటర్లను సైతం తన వైపు తిప్పుకొని, ప్రత్యర్థి లీ పెన్‌ వర్గాన్ని నిర్వీర్యం చేయాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా తన రాజకీయ, ఆర్థిక, సామాజిక అజెండాకు మద్దతుగా యావత్‌ ఫ్రాన్స్‌ను సమైక్యపరిచి, వెన్నంటి నిలిచేలా చూసుకోవాలి. జీ–7 దేశాల్లో అమెరికా తర్వాత అత్యంత వేగంగా కరోనా దెబ్బ నుంచి కోలుకున్న ఫ్రాన్స్‌ను తన ఆరేళ్ళ వయసు పార్టీతో ఇప్పుడు నూతన శకంలోకి నడిపించాల్సింది మెక్రానే. అది అంత సులభమేమీ కాదు. ఆ సంగతి మెక్రాన్‌కూ బాగా తెలుసు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top