ఈ చింత తీరేదెట్లా?

Sakshi Editorial on Congress Position in Upcoming Gujarat Elections

చింతలు ఎక్కువైనప్పుడు చింతన తప్పదు. సమస్యలతో సతమతమవుతున్న శతాధిక వర్ష కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజుల పాటు ఆ పనే చేసింది. కానీ, రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ చింతన్‌ శిబిర్‌లో కొంత దృఢ నిశ్చయంతో, కొన్ని నవ సంకల్పాలు చెప్పుకున్నా... కాంగ్రెస్‌ పార్టీని వెంటాడుతున్న చింతలు మాత్రం తీరేలా కనిపించడం లేదు. శిబిరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నామని ఊపిరి పీల్చుకొనే లోగా, ఆ పార్టీకి ఒకటికి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నికలు రానున్న గుజరాత్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్, ఇటీవలే ఎన్నికలు ముగిసిన పంజాబ్‌లో పార్టీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ ఇద్దరూ రోజుల తేడాలో పార్టీకి గుడ్‌బై చెప్పారు. సునీల్‌ వెంటనే బీజేపీ కండువా కప్పుకుంటే, హార్దిక్‌ రేపోమాపో ఆ పనే చేయనున్నట్టు వార్త. ఇవి చాలదన్నట్టు రానున్న గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తాజా జోస్యం. ఇవేవీ అనూహ్యం కాకున్నా, గాలి ఎటు వీస్తోందో అర్థమై, భవిష్యత్తు కళ్ళ ముందే కనిపిస్తూ కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. 

బలమైన ఏకవ్యక్తి నాయకత్వం కింద ఒక పార్టీయే దేశ రాజకీయాలను శాసించడం మంచిది కాదని 1970, 80లలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి. కానీ, బలహీన అజెండా తప్ప మూడు రోజుల మథనంతో కాంగ్రెస్‌ సాధించినదేమిటంటే సంతృప్తికర మైన సమాధానం లేదు. సమస్యలున్నట్టు గుర్తించారన్న ఊరటే తప్ప, సమగ్రమైన పరిష్కారం కోసం ప్రయత్నం కనిపించదు. యాభై ఏళ్ళ లోపు వారికి సీట్లలో రిజర్వేషన్, వారసులకు సీట్ల కేటాయింపులో పరిమితి విధింపు, పార్టీ ఆఫీస్‌ బేరర్లకు నిర్ణీత పదవీకాలం, వివిధ సలహా సంఘాల ఏర్పాటు లాంటి పై పై చర్యలతో పార్టీ ఎదుర్కొంటున్న పెను సంక్షోభాన్ని నివారించడం అయ్యే పనీ కాదు. వరుస పరాజయాలు, ‘జీ–23’గా పేరుపడ్డ పార్టీ సీనియర్ల ధిక్కారస్వరం, ప్రశాంత్‌ కిశోర్‌ చూపిన చేదు నిజాలు, ఇచ్చిన సలహాలు – ఇవేవీ కాంగ్రెస్‌ను సుప్త చేతనావస్థ నుంచి ఇంకా కదిలించినట్టు లేవు.   

నవ తరాన్ని ఆకట్టుకొనే ప్రయత్నాలు, పార్టీకి జవజీవాలిచ్చే ఆలోచనలు అధిష్ఠానం చేస్తోందా అంటే అనుమానమే. సంక్షేమ పథకాలు, సంస్థాగతంగా ఎస్సీ – ఎస్టీ – ఓబీసీలకు కోటాలు, యాత్రల లాంటివి ప్రకటించినా, అవి ఇప్పటికే అరిగిపోయిన అస్త్రాలు. మోదీ రెండోసారి గెలవ గానే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్‌ తప్పుకున్నాక ఇప్పటి దాకా కాంగ్రెస్‌ దాదాపు చుక్కాని లేని నావే.  2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కోరి మరీ తనను కాంగ్రెస్‌లోకి తెచ్చుకున్న రాహుల్‌ పైనే పరోక్ష విమర్శలతో యువ పాటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ తన రాజీనామా సమర్పిం చడం గమనార్హం. పార్టీ తప్పకుండా అధికారం నిలబెట్టుకుంటుందని ఏడాది క్రితం అనుకున్న పంజాబ్‌ పీఠాన్ని లేనిపోని నాయకత్వ మార్పులతో చేజేతులా పోగొట్టుకున్న ఘనత కాంగ్రెస్‌ యువ అధినాయకత్వానిదే. పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో రాహుల్‌ కానీ, యూపీలో ప్రియాంక కానీ పార్టీని కనీసం గౌరవనీయ స్థానంలో నిలపలేకపోవడం నెహ్రూ వారసుల వైఫల్యం. రాజకీయాలు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కాదనీ, కష్టపడితేనే ఫలితాలొస్తాయనీ వారికింకా అర్థమైనట్టు లేదు.  

కాంగ్రెస్‌కు కష్టాలు కొత్త కావు. కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం జీవన్మరణ సమస్యే. ఆ లోగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రీ–ఫైనల్స్‌. 2014లో 44, ఆ తర్వాత 2019లో 52 స్థానాలే గెలిచి, గడచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయస్థాయిలో ఆ పార్టీ ఓట్‌ షేర్‌ 1984లో యాభై ఏళ్ళ అత్యధికమైన 49.1 శాతానికి చేరింది. ఇప్పుడది 19 శాతం దగ్గర తారట్లాడుతోంది. గత 8 ఏళ్ళలో జరిగిన 50 అసెంబ్లీ ఎన్నికల్లో 37 ఎన్నికల్లో ఆ పార్టీ పరా జయం పాలైంది. ప్రస్తుతం రెండే రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ స్వయంగా అధికారంలో ఉంది. రానున్న కాలం పార్టీకి అత్యంత కీలకమనేది అందుకే. 2019 ఎన్నికల్లో 170 స్థానాల్లో వరుసగా 2 సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైనవారినే అభ్యర్థులుగా ఎంచుకోవడం లాంటి తప్పులెన్నో కాంగ్రెస్‌ విజయావకాశాల్ని దెబ్బతీశాయి. ఈసారైనా అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి.                                                                                                                                                                                                                                                                            సంస్థాగత బలహీనతలు, ఎదురుగా ఉన్న సవాలు అన్నీ తెలిసినా – కాంగ్రెస్‌ తగినరీతిలో స్పందిస్తున్న దాఖలా లేదు. ఏళ్ళూ పూళ్ళూ గడుస్తున్నా పార్టీని పీడిస్తున్న సమస్యల్లో మార్పు లేదు. ప్రశాంత్‌ కిశోర్‌ ఆ మధ్య గణాంకాలతో సహా ఎత్తిచూపినవీ సరిగ్గా అవే. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. బలమైన ప్రత్యర్థిని ఓడించాలంటే, వ్యూహం ఉండాలి. ఉమ్మడి ప్రత్యర్థిపై పోరుకు బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలన్న వాస్తవాన్ని నిరాకరిస్తే నష్టమే. సంకల్పమే కాదు... నిరంతర శ్రమ, సమష్టి తత్త్వం అవసరం. అధిష్ఠానం నుంచి అడుగున కార్యకర్త దాకా పేరుకుపోయిన జడత్వాన్ని వదిలించుకోవాలి.

పార్టీలు, విదేశీ పర్యటనల ఇమేజ్‌ని చెరుపుకొని, అధినేతలూ త్యాగాలకు సిద్ధపడితే పార్టీని నిలబెట్టవచ్చు. ఇవాళ్టికీ దేశంలో బీజేపీకి బలమైన జాతీయ ప్రతిపక్షంగా తమకున్న సానుకూలతను కాంగ్రెస్‌ ఉపయోగించుకోవచ్చు. అందుకు కొత్త తరంతో, క్రొంగొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. వారసత్వం కన్నా ప్రతిభకు పట్టం కట్టాలి. దానికి ఎవరెంత సిద్ధంగా ఉన్నారన్నదే ప్రశ్న. ఆ దిశగా తొలి అడుగులు పడితే ఏ చింతన శిబిరాలైనా సఫలమైనట్టు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top