
జవాబుదారీతనం లేని అధికారం అరాచకానికి దారితీస్తుంది. దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. బంగ్లాదేశ్‌లో నిరుడు ఆగస్టు తిరుగుబాటు తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగావున్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకపక్క సత్ప్రవర్తన లేని ప్రభుత్వోద్యోగులకు త్వరగా ఉద్వాసన పలికేవిధంగా సర్వీసు నిబంధనలు మార్చటం, మరోపక్క అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలివ్వటంలో విఫలం కావటం వగైరాలు అసంతృప్తికి దారితీసి నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా సమ్మె సాగుతోంది.
ఈలోగా అమెరికా ఒత్తిడికి లొంగి లోపాయకారీగా సెయింట్ మార్టిన్స్ దీవిని కట్టబెట్టేందుకు యూనస్ పావులు కదిపారు. అంతేకాదు... దాని ఆదేశాలతో చిట్ట గాంగ్– రఖినే కారిడార్‌ను ‘మానవతా సాయం’ అందించటానికి వీలుగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిపైనా దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తంకావటంతో పాటు సైన్యం నుంచి సైతం వ్యతిరేకత వచ్చింది. పర్యవసానంగా పది నెలలకు పైగా బాధ్యత లేని అధికారం చలాయి స్తున్న ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గత్యంతరంలేని స్థితిలో తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది.
తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాందసవాదులు కత్తులు కటార్లతో రోడ్లపైకొచ్చి ముస్లిం మహిళలు బురఖా ధరించాలని హుకుం జారీచేస్తూ హడావిడి మొదలుపెట్టారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళలను నడిరోడ్డుపై దండించటం, జైళ్లపాలు చేయటం కొనసాగాయి. మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యం, అక్రమ అరెస్టులు మామూలే.
వీటని సరిదిద్దటానికి బదులు అంతా మీడియా సృష్టి అని యూనస్ దబాయింపులకు దిగారు. ఒకనాడు తూర్పు పాకిస్తాన్‌గా వున్న తమపై పాక్ పాలకుల అకృత్యాలను మరిచి, దాన్ని నెత్తినపెట్టుకోవటం మొదలుపెట్టారు. చైనాకు పోయి దాంతో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నించారు. దేశానికి పనికొచ్చేదేదో, ప్రయోజనకరమైనదేదో గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం మాని భారత్‌ను చీకాకు పెట్టడమే లక్ష్యంగా యూనస్ వ్యవహారశైలివుంది.
ఎల్లకాలమూ ఇలాగే సాగిపోతుందనుకుంటే చెల్లదు. పాత ప్రభుత్వం పతనమై పది నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించదేమన్న ప్రశ్నలు మొదలయ్యాయి. 2026 మధ్య వరకూ ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదన్నట్టు యూనస్ ప్రభుత్వం ఈమధ్య లీకులిస్తుండగా,బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్–ఉజ్–జమాన్ ఈ ఏడాది ఆఖరిలోగా ఎన్నికలు జరిగి తీరాలని నిర్దేశించారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకొస్తే తాము తిరిగి బ్యారక్‌లకు వెళ్లిపోతామని ఒక సభలో మాట్లా డుతూ ఆయన ప్రకటించారు. సహజంగానే ఇది యూనస్‌కు మింగుడు పడలేదు. అలాగని ప్రభు త్వాన్ని నడపటం ఆయనకు చేతకావటం లేదు. ప్రభుత్వంలోని మత ఛాందసవర్గం, విద్యార్థి నాయకులు చెప్పినట్టల్లా చేస్తూ ఆయన ఇప్పటికే ప్రతిష్ఠ పోగొట్టుకున్నారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ బాపతే.
బంగ్లా అధీనంలోవున్న సెయింట్ మార్టిన్స్ దీవి వ్యూహాత్మకంగా కీలకమైనది. బంగాళాఖాతంలో మన దేశం, మయన్మార్ కూడా దీనికి సమీపంగా ఉంటాయి. పదివేలమంది బంగ్లా పౌరులు నివసించే ఈ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఏనాటి నుంచో కలలుగంటున్నది. హిందూ మహా సముద్రంలో డీగో గార్షియా దీవిలో స్థావరం ఉన్నా, బంగాళాఖాతంలో లేని లోటు దాన్ని పీడిస్తోంది. ఈ దీవిపై అమెరికా మాత్రమే కాదు... చైనా కన్ను కూడా పడింది.
మయన్మార్ సైతం వీలైతే దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ సాగర చట్టాల ట్రిబ్యునల్ 2012లో ఈ దీవి బంగ్లాదేశ్‌కు చెందుతుందని, 12 నాటికల్ మైళ్ల మేర ప్రాంతం ఆ దేశానిదేనని తీర్పునిచ్చినా అడపా దడపా మయన్మార్‌తో సమస్యలు తప్పడం లేదు. ఆ దేశ సైన్యం అక్కడ మసిలే బంగ్లా పౌరులను అపహరించటం, కాల్పులు జరపటం రివాజుగా మారింది. దీన్ని అమెరికాకూ లేదా చైనాకూ అప్పగిస్తే మన దేశ భద్రతకు ముప్పు కలుగుతుంది.
కానీ యూనస్ భారత్‌పై వ్యతిరేకతతో ఈ దీవిని అమెరికాకు అప్పగించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను కూడా బంగ్లా సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన ప్రభుత్వానికే వదలాలని సూచించింది. అలాగే చిట్టగాంగ్–రఖినే కారిడార్ విషయంలోనూ సైన్యం పట్టుదలతో ఉంది.
మయన్మార్‌లో సైనిక ముఠా ప్రభుత్వ దాడుల్లో చిక్కుకున్న రఖినే ప్రాంతానికి నిత్యావసరాలు, మందులు, ఆహారం అందించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన మాట వాస్తవం. అమెరికా సైతం ఈ కృషిలో పాలుపంచుకుంటామని తెలిపింది. అయితే ఈ మాటున కారిడార్ ఆనుపానులన్నీ అమెరికా తెలుసుకుంటుందన్నది బంగ్లా సైన్యం బెంగ.
తన నిర్ణయాలను హసీనాయే కాదు... బీఎన్‌పీ నేత ఖలీదా జియా, సైన్యం, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించటంతో యూనస్‌కు ఎటూ పాలుపోలేదు. అందుకే రాజీనామా బెదిరింపులకు దిగారు. కానీ దానికెవరూ కంగారు పడిన దాఖలా లేకపోవటంతో వెనక్కి తగ్గారు.
నిర్ణయాత్మకంగా వ్యవహరించటం చేతకాని తన వ్యవహారశైలితో బంగ్లాదేశ్‌ను ఏం చేద్దామనుకుంటున్నారో యూనస్ ఆలోచించుకోవాలి. నడమంత్రపు సిరిలా వచ్చిపడిన అధికారం అండతో దేశాన్ని భ్రష్టుపట్టించటం మానుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించటమే గౌరవప్రదమని గ్రహించాలి.