ఈ నిషేదంతో లాభమెంత?

Central Ban 5 Chinese Apps Threat To India Sovereignty - Sakshi

మరోసారి నిషేధపు వేటు పడింది. మరిన్ని చైనీస్‌ యాప్‌లకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతలకూ, పౌరుల వ్యక్తిగత గోప్యతకూ భంగం కలిగిస్తున్నాయంటూ సోమవారం కొత్తగా మరో 54యాప్‌లపై కొరడా జళిపించింది. దీంతో మన దేశంలో గత రెండేళ్ళలో అప్పటి టిక్‌టాక్, పబ్జీ నుంచి ఇప్పటి ఫ్రీ ఫైర్‌ దాకా 300కి పైగా చైనీస్‌ యాప్‌లు చట్టవిరుద్ధం అయ్యాయి. తాజాగా నిషేధించిన యాప్‌లన్నీ దాదాపు గతంలో వేటుపడ్డ వాటి తాలూకువే. పాతవే కొత్త పేర్లు, అవతారాలతో రంగప్రవేశం చేశాయి. దేశభద్రతకు భంగకరమైన వాటిపై కొరడా తీయడం తప్పు కాదు. తప్పనిసరి కూడా! కానీ, నిషేధం వల్ల అసలు లక్ష్యం సిద్ధిస్తుందా? 

దాదాపు రెండేళ్ళ క్రితం 2020 జూన్‌ నుంచి ఇలాంటి జిత్తులమారి చైనా యాప్‌లపై నిషేధం మొదలైంది. వేటు వేసినప్పటికీ, భారతీయుల కీలకమైన డేటాను తస్కరించడం కోసం పాతవాటికే నకలు యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా, కొత్త నిషేధ ప్రకటనలూ విడతల వారీగా వస్తూనే ఉన్నాయి. ఆ పరంపరలో తాజాగా ప్రకటన అచ్చంగా అయిదో విడత నిషేధం. చిత్రంగా, అలీబాబా, టెన్‌సెంట్, గేమింగ్‌ సంస్థ నెట్‌ ఈజ్‌ లాంటి అతి పెద్ద చైనీస్‌ టెక్నాలజీ సంస్థల నుంచి వచ్చిన యాప్‌లు కూడా తాజా నిషేధిత వర్గంలో ఉండడం గమనార్హం. టెన్‌సెంట్‌కు చెందిన అత్యధిక ప్రజాదరణ పొందిన ‘పబ్జీ’ యాప్‌పై 2020 సెప్టెంబర్‌ విడతలో భారత్‌ నిషేధం పెట్టింది. ఆ తర్వాత ‘గరేనా ఫ్రీ ఫైర్‌’ యాప్‌ పాపులరైంది. ఇప్పుడు దాన్ని నిషేధించారు. 

చైనా నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఉత్పత్తులతో గూఢచర్యం జరుగుతోందన్న ఆరోపణలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఆందోళన రేపుతున్నాయి. అందువల్లే పాశ్చాత్య దేశాలతో పాటు మనమూ టెలికమ్యూనికేషన్ల ఆధునికీకరణలో కొన్ని చైనీస్‌ హార్డ్‌వేర్‌ దిగ్గజ సంస్థలను దూరం పెట్టాం. సాఫ్ట్‌వేర్‌లో సైతం సెన్సార్‌షిప్‌లో భాగంగా ‘ఉయ్‌ ఛాట్‌’ లాంటివి ప్రైవేట్‌ సంభాషణల్ని సేకరించి, నిల్వ చేసి చైనీస్‌ న్యాయవ్యవస్థకు ఇస్తున్నాయని నిపుణుల మాట. నిషేధిత యాప్‌ల తాలూకు సంస్థలు మాత్రం భారతీయ వినియోగదారుల డేటాను చైనా సర్వర్లకు అందించడం లేదంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా, అమెరికా, లేదా స్వయంగా మన దేశవాళీ యాప్‌లలో వేటి వల్ల, ఎలాంటి చిక్కులున్నాయో ప్రభుత్వమే ససాక్ష్యంగా ప్రజలకు వివరించాలి. చైతన్యం తేవాలి. 

భారత పౌరుల కీలక డేటాను విదేశీ సంస్థలు వినియోగించుకోవడం ఆందోళకరమే. దాన్ని అడ్డుకోవాలన్న మన ప్రభుత్వ దీక్షను అభినందించాల్సిందే. కానీ, అందుకు ఎంచుకుంటున్న నిషేధ మార్గం వల్ల ఆశించిన ఉత్తమ ఫలితాలొస్తాయా అన్నదే అనుమానం. రోజూ అనేక రకాల అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, డిజిటల్‌ వస్తువులు వాడకం తప్పనిసరైన వేళ, పౌరుల వ్యక్తిగత డేటాను కాపాడాలంటే మన దేశం అవసరమైనవాటినే అనుమతించే పటిష్ఠమైన సాంకేతిక రక్షణ కవచం సిద్ధం చేసుకోవాలి. అలా కాక, తాత్కాలిక నిషేధాలు పెట్టినా, అపరిమిత సంఖ్యలోని ఈ యాప్‌ సృష్టికర్తలు చిటికెలో కొత్త పేరు, కొత్త డిజైన్‌తో పాతదానికే నకలు వదులుతారు. వెరసి, సమస్య ఆరని రావణకాష్ఠమే! 

మొదటి నుంచీ ఈ యాప్‌ల నిషేధాన్ని ‘డిజిటల్‌ స్ట్రైక్‌’గా మన పాలకులు అభివర్ణిస్తున్నారు. 2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో ఘర్షణల అనంతరమే తొలిసారి యాప్‌ల నిషేధం తెర మీదకొచ్చింది. పొరుగున ఉన్న చైనాతో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులకు ఒకరకంగా ఇది ప్రతిస్పందన. మరి కొద్దినెలల్లో లద్దాఖ్‌లో ప్రతిష్టంభనకు రెండేళ్ళవుతున్న వేళ ఇప్పుడు మరిన్ని యాప్‌లపై చర్యలు చేపట్టాం. దీనివల్ల చైనాకూ, ఆ దేశ సంస్థలకూ కలిగే నొప్పి మాత్రం కొంచెమే. ఉదాహరణకు, ‘పబ్జీ’ తర్వాత మన దేశంలో అమిత ప్రాచుర్యం పొంది, ఈసారి నిషేధానికి గురైన ‘ఫ్రీ ఫైర్‌’ మార్కెట్‌లో భారత్‌ వాటా 3 శాతమే. పైగా, కొత్త అవతారాలతో వస్తుంటే ఏటేటా ఎన్నని నిషేధించుకుంటూ పోతాం? ఇప్పటికే జరిగిన డేటా ఉల్లంఘనకు దిద్దుబాటు చర్యలు ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. అందుకే, ఒక్క చైనాయే కాక ఏ దేశమైనా కోరలు సాచే అవకాశం ఉన్న విశాల వర్చ్యువల్‌ హద్దులను కాపాడుకొనే పని మీద దృష్టి పెట్టడం కీలకం. 

దౌత్య, సైనిక అంశాల్లో పైకి ఎంత బింకం చూపినా, ఇవాళ్టికీ మనం చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్నామనేది వాస్తవం. డ్రాగన్‌తో మన వాణిజ్య లోటు నిరుడు ఏకంగా 69.4 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది చైనా నుంచి మన దిగుమతులు రికార్డు 46 శాతం, మన ఎగుమతులేమో 35 శాతం పెరిగాయి. అలా ఆ దేశంతో మన ద్వైపాక్షిక వాణిజ్యం నిరుడు ఏకంగా 44 శాతం పెరిగింది. అమెరికా తర్వాత ఇప్పుడు మన అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనాయే. ఈ ఆధారపడడాన్ని తగ్గించుకోగలిగినప్పుడే చైనాపై మనం పైచేయి ప్రదర్శించగలుగుతాం. 

అసలైతే ఆసియాన్‌ దేశాలు, యూరోపియన్‌ యూనియన్, అమెరికాలే చైనాకు అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వాములు. వారి తర్వాత భారత్‌ స్థానం ఎక్కడో ఉన్నా, అధిక జనాభా కారణంగా పొరుగునే ఉన్న మన పెద్ద మార్కెట్‌ను చైనా విస్మరించ లేదు. అదే సమయంలో డ్రాగన్‌ తమ నాసిరకం సరుకులు వదిలించుకొనే గడ్డగా మనం మిగలకూడదు. ఆత్మనిర్భరత మనకింకా సుదూర లక్ష్యమే గనక, బీజింగ్‌ మీద అతిగా ఆధారపడకుండా దీర్ఘకాలిక ఫలితాలిచ్చే చర్యలు చేపట్టాలి. డేటా భద్రత సహా అన్నిటి పైనా ప్రభుత్వం సమగ్రమైన విధానంతో ముందుకు కావాలి. అంతేకానీ, వట్టి యాప్‌ల నిషేధాల వల్ల ఉపయోగం తాత్కాలికమే!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top