హామీల ఎత్తిపోతలు! | - | Sakshi
Sakshi News home page

హామీల ఎత్తిపోతలు!

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎడాపెడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తాను అధికారంలోకి వస్తే బ్యాంకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పట్టించుకోలేదు. అసలు పరిహారం అందుతుందా..లేదా..? అన్న మీమాంస నెలకొంది.

ఇదీ సంగతి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లో గోదావరిపై రెండు లిఫ్ట్‌ ఇరిగేషన్ల నిర్మాణం చేపట్టింది. వాటిలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (మొదటి దశ) ప్రాజెక్టు ఒకటి. తూర్పుగోదా వరి జిల్లా సీతానగరం మండలం గోదావరి ఎడమగట్టున రూ.1,638 కోట్లతో పురుషోత్తపట్నంలో 2017–18లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఇందుకుగాను 312 మంది రైతుల నుంచి సుమారు 250 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములకు పరిహారం ఇచ్చే సమయంలో 2013 భూసేకరణ చట్టం పక్కన పెట్టి, ప్రత్యేకంగా 88 జీఓ విడుదల చేసింది. కన్సెంట్‌ అవార్డు పాస్‌ చేసి ఎకరానికి రూ.24 లక్షలు, రూ.28 లక్షలుగా రెండు రకాల పరిహారం ప్రకటించింది. ఆ సమయంలో బయట మార్కెట్లో ఎకరం భూమి రూ.40 లక్షలు పైబడి ధర ఉండటంతో ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డెక్కారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వం లాఠీచార్జి చేయించింది. రైతుల నిరాహార దీక్ష శిబిరాలను బలవంతంగా తొలగింపజేసింది.

న్యాయస్థానం ఆదేశించినా?

2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు సైతం చంద్రబాబు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో చంద్రబాబు అవార్డు ప్రకటించిన రూ.17.81 లక్షలు ట్రిబ్యునల్‌లో జమ చేయకపోవడం మరో మోసం అంటున్నారు. అక్టోబర్‌ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారంలో మొదటి ఏడాది 9 శాతం, రెండో ఏడాది నుంచి ఇప్పటి వరకు 15 శాతం వడ్డీతో నాలుగు వారాల్లో చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు సైతం అమలు కాలేదు.

మరోసారి మోసపోయిన రైతులు

2023లో పురుషోత్తపట్నం వచ్చిన చంద్రబాబును భూముల పరిహారంపై రైతులు నిలదీశారు. అధికారంలోకి రాగానే బ్యాంక్‌ వడ్డీ వేసి ఆరు నెలల్లో ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. చెల్లించకపోవడంతో మరోసారి చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయినట్టయింది.

పరిహారం తీసుకోకుండానే మృతి

ఎత్తిపోతల నిర్మాణంలో పురుషోత్తపట్నం, చిన కొండేపూడి, వంగలపూడి, రామచంద్రపురం తదితర గ్రామాల్లోని 72 ఎకరాల భూములకు చెందిన రైతులకు ఇప్పటికీ పరిహారం లేదు. వీరిలో కొండేటి కృష్ణారావు, దుద్దుపూడి చిట్టెమ్మ, సురవరపు తాతారావు, నీరుకొండ సీతారత్నం, కోడేబత్తుల దుర్గం వంటి రైతులు చనిపోయారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం లేదు.

వైఎస్సార్‌ సీపీ పోరాటం

రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అప్పట్లో వైఎస్సార్‌ సీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు హయాంలో రైతులపై పెట్టిన కేసులను ప్రత్యేక జీవో ద్వారా ఎత్తి వేయించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఉంది. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి రైతుల పక్షాన పోరాడారు.

ఆదుకున్న వైఎస్‌ జగన్‌

చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేక.. ఎన్జీటీ అపరాధ రుసుం విధించింది. పథకం నుంచి సాగునీరు నిలిపివేసింది. అప్పట్లో రైతులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. 2022లో ఎన్జీటీకి అపరాధ రుసుం కింద రూ.2.5 కోట్లు చెల్లించారు. సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల

పథకం రైతులకు తీరని అన్యాయం

312 మంది నుంచి

259 ఎకరాల సేకరణ

తాను అధికారంలోకొస్తే బ్యాంకు వడ్డీతో సహా చెల్లిస్తానని

చంద్రబాబు హామీ

రెండేళ్లయినా పట్టించుకోని వైనం

పరిహారం అందకుండా

పదిమంది మృత్యువాత

ఆమోదయోగ్యమైన పరిహారం ఇవ్వాలి

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం వడ్డీతో సహా చెల్లించాలి. పురుషోత్తపట్నం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలను చంద్రబాబు ప్రభుత్వం డబ్బు ఎత్తి పోయడానికే రూపకల్పన చేసింది. ఆనాడు పట్టిసీమ త్వరితగతిన పూర్తి చేశారని కాంట్రాక్ట్‌ సంస్థకు ఇన్సెంటివ్‌ కింద అదనపు సొమ్ము చెల్లించారు. పురుషోత్తపట్నం అనివార్య కారణాలతో ఆలస్యమైందని కాంట్రాక్ట్‌ సంస్థకు అంచనాలను పెంచి సొమ్ము చెల్లించారు. మరి రైతులు ఏం పాపం చేశారని న్యాయమైన నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు పోలవరంలో భాగమని అప్పటి టీడీపీ ప్రభుత్వం వాదించింది. పోలవరం డీపీఆర్‌లో మాత్రం చూపించలేదు. సరైన ప్రొసీజర్‌ను ప్రభుత్వం పాటించలేదు. ఫలితంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఎన్నో న్యాయపరమైన చిక్కుల కారణంగా రైతుల పరిహారం పెండింగ్‌లో ఉండిపోయింది.

– జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ

యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు,

మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement