పెరవలి (కొవ్వూరు): కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక దందా అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. టీడీపీలో కీలక నేత అయిన ఆయన ఇసుక దందాలో ఎక్కడ గుట్ట వేయాలి కాదు కొండ వేయాలి, ఎక్కడ ర్యాంప్ ఏర్పాటు చేయాలి, దందా ఎలా చేయాలి, ఏ ర్యాంప్ మూసివేయాలి, ఎవరైనా అధికారి మాట్లాడితే నోరు ఎలా మూయించాలి అనేవి చూసుకుంటారు. పొరపాటున ఏ అధికారైనా ర్యాంప్‌ల వైపు చూస్తే ఆయన బదిలీ తప్పదంటున్నారు. ఈ అక్రమ ఇసుక దందా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ జరిగే అరాచకాలు ఎక్కడా జరగవేమో. గ్రామానికి ఒక ర్యాంప్ ఉండటం సహజం కానీ ఇక్కడ ఒక్కో గ్రామంలో 2 నుంచి 4 ర్యాంప్‌లు ఏర్పాటు చేశారంటే ఆయన ఏవిధంగా అక్రమ ఇసుక దందాను నడుపుతున్నారో అర్థం అవుతుంది. ఈ అరాచకాన్ని చూస్తున్న జనం అయ్యో ‘రామ’.. అయ్యో ‘కృష్ణ’ ఇదేం విడ్డూరం అని ముక్కున వేలేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు ఆయనకు సలామ్ కొట్టడం తప్ప అక్రమాలు అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనికి కారణం మామూళ్లు ఎప్పటికప్పడు అందటమే అంటున్నారు. అనుమతులు లేకపోయినా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న 15 ఇసుక రీచ్‌ల వద్ద వేసిన గుట్టలే ఇందుకు సాక్ష్యం. ఇవి గుట్టలు అనే కంటే కొండలు అంటే బాగుంటుంది. ఎకరం నుంచి 3 ఎకరాల్లో వీటిని వేస్తున్నారు. కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో, నిడదవోలు మండలం పురుషోత్తపల్లిలో కొండలను పోలిన గుట్టలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా మొత్తంలో 10 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ఇసుక నిల్వలు ఉండకూడదు. కానీ ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ఇసుక గుట్టలు ఉన్నాయని అంచనా.
ర్యాంప్‌లు ఎన్ని.. మూసినవి ఎన్ని?
కొవ్వూరు నియోజకవర్గంలో అధికారిక లెక్కల ప్రకారం 45 ర్యాంప్‌ల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉండగా ఈ నేత ప్రభావంతో కేవలం 15 ర్యాంప్‌ల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఏరినమ్మలో 2 ర్యాంప్‌లకు అనుమతులు ఉంటే ఒకటి నిర్వహిస్తుండగా, దొండగుంటలో 4 ఉంటే 2 నిర్వహిస్తున్నారు. ఆరికరేవులలో 4 ఉండగా 2 నిర్వహిస్తున్నారు. ప్రక్కిలంకలో 15 ర్యాంప్‌లకు అనుమతులు ఉండగా 3 మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక తాడిపూడి 6, విజ్జేశ్వరంలో 3, తాళ్ళపూడిలో 5 ర్యాంప్‌లను పూర్తిగా తెరవలేదు. కుమారదేవం, వేగేశ్వరం, ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్, పురుషోత్తపల్లి వద్ద ఇసుక గుట్టలు భారీ స్థాయిలో ఉన్నాయి.
మామూళ్ల మత్తులో అధికారులు
అధికారులకు ఏ నెలకి ఆ నెల మామూళ్లు అందటంతో కిమ్మనకుండా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఈ అక్రమాల గురించి ఫిర్యాదులు చేస్తే అధికారులే బుజ్జగించడం, సెటిల్‌మెంట్ చేయటం, కుదరకపోతే కేసులు పెడతామని బెదిరింపులకు దిగటం పరిపాటిగా మారింది. ఆ కీలక నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ, పోలీస్ డిపార్టుమెంట్‌లను తన అవసరాలకు వాడుకుంటూ ఇసుక దందాను దర్జాగా చేస్తున్నాడు.
పురుషోత్తపల్లిలో...
కొవ్వూరులో ఇసుక గుట్ట
ఔరంగబాద్‌లో ...
కొవ్వూరు నియోజకవర్గంలో
ఎక్కడ పడితే అక్కడ ఇసుక కొండలు
టీడీపీ కీలక నేత
కనుసన్నల్లో జోరుగా దందా
అయ్యో ‘రామ’..
అయ్యో ‘కృష్ణ’ అంటున్న జనం
45 ర్యాంప్‌లకు అనుమతులు ఉండగా
15 ర్యాంప్‌ల్లోనే తవ్వకాలు
అనుమతులు లేకపోతే చర్యలు
జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇసుక గుట్టలు వేయటానికి అనుమతులు ఉన్నాయి. అనధికారకంగా ఇసుక గుట్టలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొవ్వూరు నియోజకవర్గంలో కుమార దేవంలో 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక గుట్ట వేయటానికి అనుమతులు ఉన్నాయి.
– పి.ఫణిభూషణ్‌రెడ్డి, జిల్లా మైనింగ్ ఏడీ


