ఫీజు రీయింబర్స్‌ చేయాలంటూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌ చేయాలంటూ ధర్నా

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.5,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విభాగ కన్వీనర్‌ సత్యసాయి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది విద్యను ఒత్తిడిలో అభ్యసిస్తున్నారన్నారు. ఫీజులు కట్టకపోతే కళాశాలలు పరీక్షలు రాయనివ్వకపోవడంతో ఇబ్బందులు పడతున్నారన్నారు. డిగ్రీలు పూర్తయిన దాదాపు 7 లక్షల మంది సర్టిఫికెట్లు తెచ్చుకోలేక అయోమయంలో ఉన్నారన్నారు. ఫీజులు కట్టకపోయినా పరీక్షలు రాయనివ్వాలని జీఓ జారీ అయినా ఏ ఒక్క కళాశాల పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యసమితి సభ్యులు వినయ్‌, ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్‌ లలిత్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్‌ పాల్గొన్నారు.

కొమరిపాలెం పంచాయతీకి

ఐఎస్‌వో గుర్తింపు

అనపర్తి: బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు గుర్తింపుగా ఇచ్చే ఐఎస్‌వో సర్టిఫికెట్‌కు ఎంపికయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో కొమరిపాలెం గ్రామం మొదటగా ఈ పురస్కారానికి ఎంపికై నట్టు పంచాయతీ ప్రత్యేకాధికారి వి.నాగేంద్రప్రసాద్‌ బుధవారం తెలిపారు. కేరళకు చెందిన ప్రత్యేక ఆడిట్‌ బృందం సోమ, మంగళవారాలలో గ్రామంలో పర్యటించింది. ఆడిట్‌ బృంద సభ్యులు కేఎం సలీమ్‌ ఆధ్వర్యంలో విజయవాడ పీఆర్‌ కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది కళ్యాణి తదితరులు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, పంచాయతీ కార్యాలయ ఫైళ్ల నిర్వహణ, కార్యాలయ పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. గ్రామస్తుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించిన బృంద సభ్యులు పంచాయతీ పనితీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించి ఐఎస్‌వో సర్టిఫికెట్‌కు ఎంపిక చేసినట్టు ప్రత్యేకాధికారి తెలిపారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన స్థానిక నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి ఎం చిన్ని, డి రాము, లచ్చిరెడ్డి అపర్ణ, వీఆర్వో శివకుమార్‌, సచివాలయ సిబ్బందిని అభినందించారు.

రత్నగిరికి భక్తుల వెల్లువ

అన్నవరం: రత్నగిరికి బుధవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు తరలి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్‌ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర పంచిపెట్టారు. వ్రతాలు 2,500 జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ స్వామివారికి పుష్పాలతో, అమ్మవారికి కుంకుమతో, శంకరునికి బిల్వ పత్రాలతో పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement