సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మాదక ద్రవ్యాలు కట్టడి చేయడంలో విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ కీర్తి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఎన్‌కోర్డ్‌ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నిఘా ఉంచాలన్నారు. ఎవరిౖపైనెనా అనుమానం వస్తే వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. ముందుగా పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో వారానికి ఒక రోజు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్టు అనుమానం వస్తే ఈగల్‌ టీం, శక్తి టీంలకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ మాట్లాడుతూ మార్చి నెలలో జరిగిన ఎన్‌కోర్డ్‌ సమావేశం నుంచి ఇప్పటివరకు రూ.13.66 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు

బాణసంచా తయారీ, విక్రయ దుకాణాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్‌ కీర్తి సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో తాత్కాలికంగా బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుకాణాల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని బాణసంచా తయారీ దారుల అసోసియేషన్లు విజ్ఞప్తి చేయడంతో బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో పాటు అసోసియేషన్‌ ప్రతినిధులతో కలెక్టర్‌, ఎస్పీ, జేసీ సమావేశం నిర్వహించారు. అనుమతికి మించి పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం, నైపుణ్యం లేని కార్మికులను వినియోగించడం, భద్రతా ఏర్పాట్లు లేని గదుల్లో తయారీ, అగ్నిమాపక ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలే ప్రమాదాలకు కారణాలని అధికారులు వివరించారు. కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డుతో పాటు బీమా సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ డీ. నరసింహకిశోర్‌ మాట్లాడుతూ తయారీ కేంద్రంలో సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. జేసీ మేఘస్వరూప్‌, కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్టీవోలు కె.ఆనందరావు, ఆర్‌.శివ రాముడు, జిల్లా అగ్ని మాపక అధికారి కె.మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ కీర్తి, ఎస్పీ నరసింహ కిశోర్‌

Advertisement
 
Advertisement
Advertisement