రంగంపేట: అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మట్టి అక్రమ దందా నిరాటకంగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలోని పాపాయి చెరువులో కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే చెరువులోని మట్టిని స్ధానిక రైతులు తమ సొంత భూమిలో మెరక చేసుకోవడానికే ఉపయోగించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ప్రయోజనాలకు బయట ప్రాంతాలకు తరలించి రూ.లక్షల రూపాయలు దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమతులు పొందిన 30 రోజుల్లోపు చెరువులోని సిల్టును తీసి పొలాల్లో మెరక చేసుకోవాలి, లేదంటే అనుమతులు రద్దు అవుతాయి. కానీ ఇక్కడ అనుమతుల గడువు తీరిపోయినా రోజుల తరబడి మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. చెరువులోని మట్టిని గరిష్టంగా 3 వేల క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికే అనుమతి ఉంది. కానీ పాపాయి చెరువులోని మట్టిని ఇష్టానుసారంగా తవ్వి అమ్మకాలు సాగించినట్టు చెబుతున్నారు. కాగా.. దీనిపై తహసీల్దార్ అనసూయ మాట్లాడుతూ పాపాయి చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న లారీలను, జేసీబీలను సీజ్ చేసి తమ కార్యాలయ ఆవరణలో ఉంచామన్నారు. తదుపరి చర్యల కోసం రాజమహేంద్రవరం ఏడీ మైనింగ్ అధికారులకు నివేదిక అందించామని, వారు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.


