● పెళ్లి బృందం వెళుతున్న వ్యాన్ బోల్తా
● 16 మందికి గాయాలు
● ఆస్పత్రికి వెళ్లే సరికి వారిలో ఒకరి మృతి
● క్షతగాత్రులకు పెద్దాపురం
సీహెచ్‌సీలో చికిత్స
● మెరుగైన వైద్యం కోసం
కాకినాడకు తరలింపు
గండేపల్లి/సామర్లకోట: వారందరూ ఎంతో సంతోషంగా శుభకార్యానికి హాజరయ్యారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపి, భోజనాల అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి పామాయిల్ తోటలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రికి వెళ్లే సరికి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం ఆర్బీపట్నానికి చెందిన కొల్లు సత్యకు గండేపల్లి మండలం యల్లమిల్లికి చెందిన బుంగా సతీష్‌తో బుధవారం యల్లమిల్లిలో వివాహం జరిగింది. ఈ వేడుకకు పెళ్లి కుమార్తె బంధువులు వ్యాన్‌లో వచ్చారు. తిరుగు ప్రయాణంలో గండేపల్లి మండలం పి.నాయకంపల్లి శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో టర్నింగ్ వద్ద వ్యాన్ అదుపుతప్పి ఆయిల్ పామ్ తోటలోకి పల్టీలు కొట్టుకొంటూ దూసుకుపోయి ఆగింది. బాధితుల ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో వెళుతున్న ఇతర ప్రయాణికులతో కలిసి క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌తో కలిపి వ్యాన్‌లో 16 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గరు పురుషులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో 14 ఏళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దాపురం ఆస్పత్రిలో చికిత్స
పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో క్షతగాత్రులకు వైద్యం అందించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి తెలిపారు. సీహెచ్ జ్యోతిబాబు, డి.హర్ష, ఆర్.ప్రవీణ్ కుమార్, ఎ.లోవకుమారి, ఆర్.మారియ్య, పి.లోవలక్ష్మి, ఎం.చంద్రావతి, ఎ.వీరదుర్గాప్రసాద్, ఎస్.వెంకటలక్ష్మి, ఎం.బుజ్జి, కె.ఏసురత్నం, కె.సూరిబాబు, సంజన, ఎస్.సురేంద్రలకు వైద్యం అందించామన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే సుశాంత్ కుమార్ (14) మృతి చెందాడన్నారు.
మిన్నంటిన రోదనలు
పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం బుధవారం సాయంత్రం క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలతో నిండిపోయింది. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్, పెద్దాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌తో కలిసి సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై వి.మౌనిక, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు.


