దాడి ఘటనలో వ్యక్తికి ఎనిమిదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

దాడి ఘటనలో వ్యక్తికి ఎనిమిదేళ్ల జైలు

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

కోటనందూరు: తండ్రి, కొడుకుపై దాడి చేసిన నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కేఏ మల్లవరం గ్రామానికి చెందిన గాడి సూర్యప్రకాష్‌ తనపై, తన కుమారుడు మణికంఠ ఈశ్వర్‌పై కత్తి పీటతో దాడి చేసి గాయపర్చాడని రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామానికి చెందిన లెక్కల సత్యనారాయణ 2021లో కోటనందూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎస్సై ఎం.అశోక్‌ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. బుధవారం పిఠా పురం అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్డు జడ్జి ఎం.బాబు కేసు విచారించి నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

ప్రయాణికుల ఆటో బోల్తా

నిడదవోలు రూరల్‌: నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం ప్రయాణికులతో వెళుతున్న ఆటో మండలంలోని తాళ్లపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఆటోలోని ప్రయాణికులందరూ స్వల్పగాయాలతో బయటపట్టారు. ఆటోలో సుమారు 15 మంది ప్రయాణించడంతో పాటు రోడ్డు మార్జిన్‌ దిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

25 నుంచి శాప్‌

అకాడమీ ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శాప్‌ అకాడమీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్‌ కుమార్‌ బుధవారం తెలిపారు. కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వెయిట్‌ లిిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, ఖోఖో క్రీడలకు బాలికల విభాగంలో ఎంపికలు ఉంటాయన్నారు. 15 ఏళ్లు పైబడి 19 ఏళ్లలోపు బాలికలు అర్హులన్నారు. 25న డీఎస్‌ఏ కాకినాడలో వెయిట్‌లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌లోనూ, 26న హాకీలోను, 28న ఖోఖో ఎంపికలు జరుగుతాయన్నారు. వివరాలకు 94400 31601ను సంప్రదించాలన్నారు.

తిరుపతిలో..

తిరుపతిలోని శ్రీనివాస కాంప్లెక్స్‌లో బ్యాడ్మింటన్‌ బాలురు–10, బాలికలు–10 క్రీడాకారులకు ఈ నెల 21న, బాక్సింగ్‌లో 15 మంది బాలురకు ఈ నెల 22న, వెయిట్‌ లిఫ్టింగ్‌లో 15 మంది బాలురకు ఈనెల 23న, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌టెన్నిస్‌లో ఒక్కొక్క క్రీడలో 10 మంది బాలురు, 10 మంది బాలికలకు ఈ నెల 24న జరుగుతాయన్నారు.

విశాఖలో...

విశాఖ కొమ్మాడి ఎస్‌కేపీలో ఈ నెల 29న అథ్లెటిక్స్‌లో 15 మంది బాలురకు, 30న సైక్లింగ్‌లో 15 మంది బాలురకు, 31న వాటర్‌ స్పోర్ట్స్‌లో 15 మంది బాలురకు ఎంపికలు నిర్వహిస్తున్నారన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత అర్హత పత్రాలతో ఉదయం 7 గంటకు హాజరుకావాలని తెలిపారు.

సొసైటీ పెట్రోల్‌ బంక్‌

సొమ్ము స్వాహా!

తాళ్లపూడి: మలకపల్లి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు సమాచారం. పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో సుమారు రూ.22.40 లక్షలు స్వాహా అయ్యాయని, బంక్‌లో పనిచేస్తున్న గుమస్తా, సొసైటీలో పనిచేస్తున్న మరో వ్యక్తి కలిసి ఈ నిధులను దారి మళ్లించినట్టు తెలుస్తోంది. రోజు వారీ అమ్మకాలు చేయగా వచ్చిన నగదును సొసైటీలో జమ చేయాల్సి ఉండగా, వారు కొంత సొమ్మును దఫదఫాలుగా వాడుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలు ఇటీవల జరిగిన ఆడిట్‌లో బయట పడ్డాయి. దీనిపై సహకార సంఘ డీఆర్‌ ఎం.జగన్నాథరెడ్డి మాట్లాడుతూ 2025 సెప్టెంబర్‌ నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో ఈ అవకతవకలు జరిగాయన్నారు. డిపార్టుమెంట్‌ ద్వారా రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. కాగా.. దీనిపై తాళ్లపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement