20న మెడికల్‌ దుకాణాల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

20న మెడికల్‌ దుకాణాల బంద్‌

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మందుల అంగడి వ్యాపారమైపోయిందని, ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలతో పెను ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఈ మేరకు కృష్ణానగర్‌లోని డ్రగ్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.శ్రీనివాసరావు, కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ఆలిండియా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ నిర్ణయానుసారం ఈ నెల 19 తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు మందుల దుకాణాల బంద్‌ నిర్వహించనున్నామన్నారు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్‌ సంస్థలు అధిక డిస్కౌంట్లను ఆపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్లతో ఈ బంద్‌ చేస్తున్నామన్నారు. మందుల దుకాణదారులందరూ దీన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పిల్లా బాల, కార్యదర్శి ఫణీంద్ర, మందుల వర్తకులు పాల్గొన్నారు.

కోనసీమ జిల్లాలో..

అమలాపురం టౌన్‌: కెమిస్ట్‌ల జీవనాధారం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 20న జిల్లాలో బంద్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా డ్రగ్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌వీఎస్‌ శ్రీనివాసమూర్తి, కార్యదర్శి వీవీఎస్‌ మూర్తి వెల్లడించారు. అమలాపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్‌ హాల్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బంద్‌ విషయాలను వివరించారు. ఆ రోజు జిల్లాలోని దాదాపు వెయ్యి మందుల షాపులు మూతపడనున్నాయన్నారు. కార్పొరేట్‌ సంస్థలు అధిక డిస్కౌంట్ల ద్వారా మార్కెట్‌ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్‌ కోశాధికారి బీఎస్‌ఎస్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement