సమర సంతకం!
సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై విద్యార్థులు, ప్రజలు, అన్ని వర్గాలవారూ సమర సంతకాలు చేశారు. వైఎస్సార్ సీపీ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి చేయందించాయి. లక్షలాది సంతకాలు సేకరించి చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టింది. పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించింది. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సంతకాల ప్రతులను అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రత్యేక బాక్సుల్లో భారీ ర్యాలీగా తీసుకువచ్చారు. రెండు రోజుల అనంతరం వాటిని గవర్నర్ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యక్రమంలో పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్రకార్యదర్శులు చందన నాగేశ్వర్, నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గిరజాల బాబు, అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కార్యాలయానికి సంతకాల ప్రతులు
జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలలో లక్ష్యం మేరకు సంతకాలు సేకరించారు. ఆ ప్రతులను ప్రత్యేక బాక్సులలో ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో రాజమహేంద్రవరంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నినదించారు. సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయంలో భద్రపరిచారు.
17న గవర్నర్ వద్దకు
జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను ఈ నెల 15వ తేదీన జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించి, అదే రోజు జిల్లాలోని పార్టీ శ్రేణులు సమావేశమైన సంతకాల ప్రతులతో ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి విజవాడకు తీసుకువెళ్తారు. 17వ తేదీన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మరి కొంత మంది ప్రముఖ నేతలు గవర్నర్‌ను కలసి సంతకాల ప్రతులను అందజేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా నేతలు తలమునకలవుతున్నారు.
జిల్లాలో ఇలా...
జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 60 వేల సంతకాలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 4.2 లక్షల సంతకాలు సేకరించాలని భావించారు. అన్ని నియోజకవర్గాల్లో లక్ష్య సాధనకు కృషి చేశారు. ఇప్పటి వరకు 4,05,129 సంతకాలు చేపట్టారు.
● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 70 వేల సంతకాలు సేకరించారు. లక్ష్యానికి మించి సంతకాలు నమోదయ్యాయి. సంతకాల ప్రతులను మాజీ మంత్రి పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రదర్శించారు.
● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో 45 వేల సంతకాలు సేకరించారు. మరో రెండు రోజుల్లో 50 వేలు సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సంతకాల ప్రతులను భరత్, పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి పంపారు.
● రాజానగరం నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో లక్ష్యానికి అనుగుణంగా 60 వేల సంతకాలు పూర్తి చేశారు. ఆ ప్రతులను జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నేతలు ప్రదర్శించి అనంతరం బాక్సుల్లో ప్యాక్ చేసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతరం రాజానగరంలోని పార్టీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి భారీ ర్యాలీగా తీసుకువచ్చారు.
● పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సంతకాలు సేకరించారు. లక్ష్యాన్ని అధిగమించి 60,129 సంతకాలు పూర్తి చేశారు. అనంతరం జిల్లా కార్యాలయానికి తరలించారు.
● కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నేతృత్వంలో 55 వేల సంతకాలు చేయించారు. సంతకాల పత్రాలను పెట్టెల్లో కొవ్వూరు పార్టీ కార్యాలయంలో ప్రదర్శించి అనంతరం ర్యాలీగా బయలు దేరి రాజమహేంద్రవరంలోని జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుకు అప్పగించారు.
● గోపాలపురంలో మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 55 వేల సంతకాలు సేకరించారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల నుంచి రాజమహేంద్రవరం జిల్లా పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు.
● నిడదవోలులో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ముగిసింది. లక్ష్యానికి అనుగుణంగా 60 వేల సంతకాలు పూర్తి చేశారు. సంతకాల ప్రతులను బాక్సుల్లో పెట్టి జిల్లా కార్యాలయానికి తరలించారు.
రాజానగరంలో ప్రతులు చూపుతున్న పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
జక్కంపూడి రాజా, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు
నిడదవోలులో సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి
తరలిస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు
అవిశ్రాంత కృషి
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాలు సేకరించాలన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు గత అక్టోబర్ పదో తేదీన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణకు ముందుకు కదిలారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందించారు. పోస్టర్లు ఆవిష్కరించారు. ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేరించారు. బుధవారంతో ఈ కార్యక్రమం ముగిసింది. వైఎస్సార్ సీపీ ఆందోళనలకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై తమ ఆగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై
వైఎస్సార్ సీపీ, ప్రజలు,
విద్యార్థుల గర్జన
పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి
పిలుపునకు విశేష స్పందన
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ
కోటి సంతకాల సేకరణ
జిల్లా వ్యాప్తంగా
సంతకాలు, భారీ ర్యాలీలు
అన్ని నియోజకవర్గాల నుంచి
జిల్లా కార్యాలయానికి ప్రతులు
రెండు రోజుల్లో గవర్నర్‌కు
అందించనున్న నేతలు
సమర సంతకం!


