
సత్యదేవా... చూడవయ్యా..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రూపాయినీ ఆచితూచి ఖర్చు చేయాలి. అయితే శిథిలావస్థకు చేరడంతో కూల్చివేయాలని గతంలో నిర్ణయించిన ఓ భవనానికి మరమ్మతులు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీని మరమ్మతులకు సుమారు రూ.రెండు కోట్లు వ్యయమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు ఇవీ..
రత్నగిరిపై గల సీతారామ సత్రాన్ని 94 గదులతో 1990లో నిర్మించారు. ఈ సత్రం ఆవరణలో వివాహాలు కూడా పెద్ద సంఖ్యలో జరిగేవి. అయితే ఈ సత్రం శిథిలావస్థకు చేరడంతో దానిలో బస చేసేందుకు భక్తులు భయపడేవారు. దీంతో దాన్ని కూల్చివేసి, అక్కడ నూతన సత్రాన్ని నిర్మించేందుకు పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులను 2024లో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ కోరారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఆ సత్రాన్ని పరిశీలించి, దాని పిల్లర్లు, కాలమ్స్ బలహీనపడ్డాయని, శ్లాబ్ పెచ్చులుగా ఊడిపోతోందని, కాబట్టి కూల్చివేయాలని నివేదిక సమర్పించారు.
నూతన సత్రానికి టెండర్
ఆ నివేదిక ఆధారంగా నూతన సత్రం నిర్మించాలని అప్పటి ఈఓ నిర్ణయించారు. రూ.11.40 కోట్లతో తొలి దశలో నాలుగు అంతస్తులతో 105 గదులతో సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవగా దాదాపు 16 శాతం లెస్‌కు టెండర్లు ఖరారయ్యాయి. జీ ప్లస్ త్రీఫ్లోర్లతో ఈ నిర్మాణం సాగనుంది. గ్రౌండ్ ఫ్లోర్‌ను వాహనాల పార్కింగ్‌కు వదిలేస్తారు. మొదటి, రెండు, మూడు ఫ్లోర్‌లలో ఫ్లోర్‌కు 35 గదుల చొప్పున 105 గదులు నిర్మించాలని నిర్ణయించారు.
మరమ్మతులకు సూచన
దేవదాయశాఖ సలహాదారు, విశ్రాంతి ఇంజినీర్ సుబ్బారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సత్రాన్ని పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేయిస్తే మరో ఐదేళ్లు పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ కు నివేదించారు. దీంతో ఆయన నూతన సత్రం నిర్మించడానికి మరో స్థలం చూడాలని ఆదేశించారు. దీంతో సత్యగిరిపై విష్ణుసదన్ పక్కనే నూతన సత్రం నిర్మించాలని ప్రతిపాదించారు.
మరమ్మతులకు రూ.2 కోట్లు
సీతారామ సత్రం మరమ్మతులకు దాదాపు రూ.రెండు కోట్లు వ్యయమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు తాత్కాలికంగా అంచనా వేశారు. సత్రం అన్ని గదులు పరిశీలించిన తర్వాత పూర్తి అంచనాలు రూపొందిస్తే ఇంకా వ్యయం పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. మరమ్మతుల అనంతరం ఆ సత్రం ఎంత కాలం ఉంటుందోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రం
కూల్చివేయాలని గతంలోనే నిర్ణయం
తాజాగా మరమ్మతులు చేయాలని ప్రతిపాదన
రూ.2 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా

సత్యదేవా... చూడవయ్యా..