
క్రీడాకారులకు వేసవి శిక్షణ శిబిరాలు
సీటీఆర్‌ఐ (రాజమహేందవరం): క్రీడాకారులకు అందించే క్రీడా పరికరాల కిట్ల వల్ల వారి అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని జేసీ చిన్నరాముడు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో క్రీడా శిక్షకులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ, వేసవి కాలంలో విజ్ఞానంతో పాటు, క్రీడలపై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా ఈ నెలాఖరు వరకూ వివిధ క్రీడాంశాల్లో 50 శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. శిక్షకులకు రూ.5 వేల విలువ చేసే క్రీడా సామగ్రి, గౌరవ వేతనం రూ.1,500, ఇతర ఖర్చులకు రూ.500 అందజేస్తున్నట్టు చెప్పారు. క్రీడల్లో మెళకువలు నేర్పుతూ, వారికి భద్రత, ఇతర సదుపాయాలు కల్పించేలా శిబిరాలు నిర్వహించాలని నిర్దేశించారు. జిల్లాలో 15 క్రీడాంశాల్లో మొత్తం 50 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా సాధికారత అధికారి డీఎంఎం శేషగిరి తెలిపారు. క్రీడల నిర్వహణ కోసం అథ్లెటిక్స్ 2, బాల్ బ్యాడ్మింటన్ 2, బాస్కెట్ బాల్ 8, బాక్సింగ్ 4, చెస్ ఒకటి, క్రికెట్ 3, ఫుట్‌బాల్ 5, హ్యాండ్‌బాల్ 2, జూడో 3, కరాటే 3, కబడ్డీ 3, తైక్వాండో 3, వాలీబాల్ 6, వెయిట్ లిఫ్టింగ్ 1, యోగా 4 కిట్లు అందజేశామని తెలిపారు.