
మట్టి అక్రమ తవ్వకాలపై దాడి
పి.గన్నవరం: మానేపల్లిలంక ర్యాంపులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు తహసీల్దార్ పి.శ్రీపల్లవి, మైన్స్ ఆర్‌ఐ సుజాత మానేపల్లి లంకకు చేరుకున్నారు. అనుమతులు ఉన్న ప్రాంతంలో కాకుండా మరోచోట మట్టిని తవ్వుతున్నట్టు నిర్ధారించారు. అక్కడ ఉన్న ఒక లోడు లారీని, ఐదు క్వారీ లారీలను, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. లోడు లారీని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెన్నపు డాంగే, మైన్స్ టీఏ అలీ తదితరులు పాల్గొన్నారు. కాగా.. మానేపల్లి లంకలో సుమారు రెండు ఎకరాల లంక భూమి నుంచి ప్రభుత్వ పనుల నిమిత్తం మట్టిని తవ్వేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో నిర్వాహకులు నదీపాయలో బాటను నిర్మించి మట్టిని తీస్తున్నారు. అయితే అనుమతి ఉన్న చోట కాకుండా మరొక ప్రాంతంలో మట్టిని తీస్తుండటంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.