అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు | - | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు

May 13 2025 12:11 AM | Updated on May 13 2025 12:11 AM

అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు

అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు

కేసును ఛేదించిన పోలీసులు

కన్నబిడ్డను కడతేర్చింది తల్లి, అమ్మమ్మే!

కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం

వివరాలు వెల్లడించిన పిఠాపురం సీఐ శ్రీనివాస్‌

పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే కారణంగో కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌ తెలిపారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇటీవల పసికందును హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు వివరాలను పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో చనిపోయిన యశ్విత తల్లి అయిన పసుపులేటి శైలజ నరసింగపురానికి చెందిన పెదపాటి సతీష్‌ను ప్రేమించి ఇరు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నారు. 2024లో వారికి పాప యశ్విత జన్మించింది. వివాహం అయినప్పటి నుంచి భర్త తనను అత్తగారింటికి తీసుకెళ్లలేదని, పాప పుట్టిన తర్వాత భర్త కుటుంబ సభ్యులు చూడ్డానికి రాలేదని, తన భర్త కూడా తనతో మునుపటిలా సఖ్యతగా ఉండడం లేదని శైలజ ద్వేషం పెంచుకుంది. తన తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని, వేరే కులానికి చెందిన సతీష్‌ను వివాహం చేసుకోవడం ఆమె తల్లి పసుపులేటి అన్నవరానికి మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో సతీష్‌కు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే శైలజకు రెండో పెళ్లి చేయవచ్చనే ఉద్దేశంతో ఆ తల్లి ఉంది. దీంతో ఇద్దరూ కలిసి పసికందును అడ్డు తొలగించుకోడానికి పథకం వేశారు. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 5 నెలల వయసు గల యశ్వితను వారి ఇంటిలోనే వారిద్దరూ పీక నొక్కి చంపేశారు. అనంతరం పాప మృతదేహాన్ని ఇంటి వెనక గల నీటి బావిలో పడవేశారు. అనంతరం హత్యను కప్పిపుచ్చడానికి పాపకు ఎవరో మాంత్రికుడు చేతబడి చేసి చంపి ఉంటాడని నమ్మించి కేసును తప్పుదోవ పట్టించడానికి వారి గుమ్మం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా కొంతసేపు నిద్ర పోయినట్లు నటించారు. అనంతరం లేచి తమ పాపను ఎవరో ఎత్తుకు పోయారంటు పెద్దగా కేకలు వేస్తూ హడావుడి చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం గాలించగా వారి ఇంటి పక్కనే ఉన్న బావిలో పాప మృతదేహం లభించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌లతో ఆధారాలు సేకరించారు. పాప తల్లి శైలజ, అమ్మమ్మ పసికందును చంపి నూతిలో పడవేసి క్షుద్ర పూజల నాటకం ఆడినట్లు సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించామన్నారు. పాప తండ్రి సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసులో నిందితులు ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి జ్యూడిషియల్‌ కస్టడీకి తరలించినట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement