
పిడుగు పాటుకు నాలుగు గేదె దూడల మృతి
భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
గోపాలపురం: మండల కేంద్రమైన గోపాలపురంలో సోమవారం పిడుగు పడడంతో నాలుగు గేదె దూడలు మృతిచెందాయి. గోపాలపురం గ్రామానికి చెందిన అక్కాబత్తుల వెంకటేశుకు చెందిన పొలంలో నాలుగు గేదె దూడలకు సమీపంలో పిడుగు పడటంతో ఆ ధ్వనికి అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. గోపాలపురం నుంచి జగన్నాథపురం వెళ్లే రోడ్డులో భారీ వృక్షాలు నేలకొరగడంతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురుగాలులు వీచాయి. గోపాలపురం నుంచి కొయ్యలగూడెం వెళ్లే జాతీయ రహదారి మాతంగమ్మ మెట్ట వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో అటు మూడు కిలోమీటర్లు, ఇటు మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు నాలుగు గంటలపాటు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ వైర్లపై చెట్టు పడటంతో వాటిని తొలగించడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

పిడుగు పాటుకు నాలుగు గేదె దూడల మృతి