
సత్యదేవుని హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. గత రెండు నెలల్లో పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఆలయానికి నవదంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు భారీగా తరలివచ్చి పెద్ద మొత్తంలో స్వామివారి హుండీలలో కానుకలు సమర్పించారు. ఫలితంగా రూ.3,31,57,122 ఆదాయం సమకూరింది. మంగళవారం హుండీలను తెరచి లెక్కించారు. గత జనవరి 27వ తేదీన లెక్కించారు. గడచిన 60 రోజులకు సంబంధించి నిత్య కల్యాణ మండపంలో తాజాగా హుండీ లెక్కింపు నిర్వహించారు. సుమారు 600 మంది సిబ్బంది, స్వచ్చంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
విదేశీ నగదు కూడా..
హుండీలో నగదు రూ.3,18,20,080 కాగా, చిల్లర నాణాలు 13,37,042. వీటితోపాటు 145 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి లభించినట్టు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ తెలిపారు.సింగపూర్ డాలర్లు 74, అమెరికా డాలర్లు 2,465, ఆస్ట్రేలియా డాలర్లు 980, సౌదీ అరేబియా రియల్స్ నాలుగు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పౌండ్లు పది, కెనడా డాలర్లు 20, యుఏఈ దీరామ్స్24, ఇండోనేషియా రూపాయలు పదివేలు, ఖతార్ కరెన్సీ 556, కువైట్ దీనార్లు 55, వియత్నాం డంగ్స్ 30 వేలు, 20 యూరోలు లభించాయని పేర్కొన్నారు. లెక్కింపు ప్రక్రియను దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ధర్మకర్తల మండలి సభ్యులు పేరూరి బద్రీ నారాయణ, విజయలక్ష్మి, దేవదాయశాఖ అధికారులు పి.నారాయణ మూర్తి, ఎంఎం వీరభద్రరావు, దేవస్థానం సిబ్బంది పర్యవేక్షించారు.
ఒక్కరోజులోనే లెక్కింపు
దేవస్థానంలో గతంలో రూ.2 కోట్లు దాటి ఆదాయం వచ్చిన సందర్భంలో రెండు రోజులు హుండీ ఆదాయం లెక్కించేవారు. ఈ సారి రూ.3.31 కోట్లు హుండీ ఆదాయాన్ని ఒక్క రోజులోనే లెక్కించడం విశేషం. గతంలో ఈ కార్యక్రమానికి చాలా మంది సిబ్బంది గైర్హాజరయ్యేవారు. దేవస్థానం సిబ్బంది కన్నా స్వచ్చంద సేవా సంస్థల సిబ్బంది ఎక్కువ కనిపించేవారు. ఈ సారి ఒక్కరు కూడా గైర్హాజరు కాకపోవడం గమనార్హం. ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు లెక్కింపు జరిగింది. హుండీ లెక్కింపు ప్రక్రియ వీడియోలో రికార్డు చేశారు. దీంతో హుండీ లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది కదలికలు కూడా ఇందులో రికార్డయ్యాయి.
హుండీల ద్వారా
రూ.3.31 కోట్ల్ల ఆదాయం
ఒకేసారి ఇంత మొత్తం ఆదాయం
ఒక రికార్డు