
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): భూసేకరణకు సంబంధించిన సమస్యలను జూన్ 30వ తేదీ నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ తేజ్ భరత్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏడీబీ రోడ్డు కోసం చేపట్టిన భూసేకరణకు సంబంధించి అంశాలను త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు. రాజానగరం మండలం పరిధిలో ఏడీబీ రహదారి విస్తరణ పనుల కోసం భూసేకరణకు చెందిన 19 సమస్యలు పెండింగ్‌లో ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ తెలిపారు. పరిహారం కోసం ఒకరు కోర్టుకు వెళ్లారన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ, సర్వే, ఆర్‌అండ్‌బీ, ప్రాజెక్ట్ మేనేజర్‌లతో కూడిన బృందాన్ని పంపించి నివేదిక అందజేస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణి, జాతీయ రహదారుల పీడీ సురేంద్ర, కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ ఎండీ ఆలీ పాల్గొన్నారు.
రూ.10 లక్షలతో
బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణం
దేవరపల్లి: దేవరపల్లిలోని అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూలు వద్ద స్థానిక పరమేశు బయోటెక్ కెమికల్ పరిశ్రమ యాజమాన్యం సుమారు రూ.10 లక్షల వ్యయంతో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణం చేపట్టింది. దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో సిమెంట్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కోర్టు నిర్మిస్తున్నట్టు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. పనులు వేగంగా జరుగుతున్నాయని పీడీ ఓరుగుంటి నాగరాజు వివరించారు.
ఆర్టీసీలో సౌకర్యాల
కల్పనకు కృషి
రాజమహేంద్రవరం సిటీ: ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి, ఉద్యోగుల సంక్షేమానికి నిరంతర కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు అన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో పలు విభాగాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అలాగే అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన రూట్లలో బస్సులు నడపాలని సూచించారు. అనంతరం జిల్లాలోని నాలుగు డిపోల అధికారులతో సమావేశం నిర్వహించి, ఆదాయ వనరులను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. డిపో అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. 2023 –24 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెంచాలన్నారు. రాజమహేంద్రవరం బస్టాండ్‌లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళల విశ్రాంతి గదులను, సరకు రవాణా భవనంలో అదనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి కే.షర్మిల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం బస్టాండ్‌లో పర్యటిస్తున్న ఈడీ వెంకటేశ్వరరావు