
కోవాతో చేసిన వివిధ రకాల స్వీట్లు
● భక్తులను ఆకట్టుకుంటున్న ‘కోవా’ కంత
● సీతారాముల కల్యాణం సందర్భంగా సీతమ్మవారికి సమర్పణ
● 20 రోజులుగా తయారీ
పి.గన్నవరం: ‘సీతమ్మకు చేయిస్తి.. చింతాకు పతకము..’ అంటూ అలనాడు భక్త రామదాసు పాడుకున్నాడు. అదేవిధంగా సీతమ్మ వారికి చిత్రమైన సారెను సమర్పిస్తున్నారు ఆ భక్త దంపతులు. స్థానిక పాత అక్విడెక్టు వద్ద శ్రీ పట్టాభి రామాలయంలో ఈ నెల 30న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు 20 రోజులుగా కోవాతో వివిధ రకాల స్వీట్లతో సారె తయారు చేయిస్తున్నారు. కల్యాణ మహోత్సవంలో శ్రీరాముని తరఫున సీతమ్మ వారికి ఈ సారె (కంత) సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు. వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, కూరగాయలు, పంచె, చీర, పర్ణశాల తదితర ఆకృతుల్లో కోవాతో తయారు చేస్తున్న ఈ స్వీట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కోవా స్వీట్లతో పాటు ఇతర పిండి వంటలను సిద్ధం చేస్తున్నారు. ‘ఇంటికో పువ్వు.. ఈశ్వరునికో మాల’ అన్నట్టుగా.. సారె తయారీలో స్థానిక మహిళా భక్తులు కూడా తమవంతు సేవలు అందిస్తున్నారు.
14 ఏళ్లుగా..
సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా కోవాతో వివిధ రకాల ఆకృతుల్లో స్వీట్లు, ఇతర పిండి వంటలు తయారు చేస్తున్నాం. మొత్తం 108 రకాలతో ఈ సారె సిద్ధం చేస్తున్నాం. 14 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నాం. ఏటా సీతారాముల సేవలో పాల్గొనే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాం. – పేరిచర్ల సత్యవాణి, పి.గన్నవరం

కోవాతో పర్ణశాలను చేస్తున్న మహిళా భక్తులు
