అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రత్నగిరి రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు రామాలయంలో సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు పెళ్లి పెద్దలుగా ఆలయం నుంచి ఊరేగింపుగా రామాలయానికి చేరుకుంటారు. అనంతరం సీతారాములను, సత్యదేవుడు, అమ్మవారిని రెండు వేర్వేరు సింహాసనాలపై వేంచేయించి, పండితులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శుభం కోరుతూ ముత్తయిదువులు పసుపు దంచుతారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ చంద్రశేఖర్ అజాద్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొంటారు. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. రామాలయం పక్కనే ఉన్న భక్తుల విశ్రాంతి మండపంలో ఈ ఉత్సం జరుగుతుంది. వచ్చే నెల 7వ తేదీ రాత్రి శ్రీపుష్పయాగంతో శ్రీరామనవమి వేడుకలు ముగుస్తాయి.