
ఆటో యూనియన్ నాయకులకు షరతులు వివరిస్తున్న ఈఓ అజాద్
అన్నవరం: కొన్ని షరతులతో రత్నగిరికి ఆటోలను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఆయన సోమవారం ఈఓ చంద్రశేఖర్ అజాద్‌కు అందజేశారు. కమిషనర్ అనుమతి లేకపోవడంతో 20 రోజులుగా ఆటోలను అనుమతించకపోవడంతో ఆటో యజమాన్లు, డ్రైవర్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, మంత్రి దాడిశెట్టి రాజాను కలిశారు. వీరిద్దరు దేవదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణతో మాట్లాడటంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐతే ఆటోల అనుమతికి విధించిన షరతులు ఉల్లంఘిస్తే మరలా అనుమతి రద్దు చేస్తామని ఈఓ చంద్రశేఖర్ అజాద్ ఈ సందర్భంగా తెలిపారు. డ్రైవింగ్‌లైసెన్స్‌తోపాటు ఆటోకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. డ్రైవర్‌తో కలిపి నలుగురు మాత్రమే ప్రయాణించాలన్నారు. డ్రైవర్లు నుదిటిన బొట్టు పెట్టుకోవాలి. ఆటో లోపల, వెలుపల అన్యమత ప్రచార చిహ్నాలు, ఫొటోలు ఉండకూడదు. ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అనుమతిస్తామని ఈఓ స్పష్టం చేశారు. ట్రిప్పునకు రూ.25, రోజంతా తిరగడానికి రూ.75 టోల్‌ఫీ కింద చెల్లించాలని వివరించారు.