
విలేకర్లతో మాట్లాడుతున్న ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి
రావులపాలెం: ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వివాదానికి ఢిల్లీ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపునిస్తూ వివాదాన్ని పరిష్కరించింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గొలుగూరి వెంకటరెడ్డి ఈ విషయం తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్‌సీ) ఓల్జేజ్ హోంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. జాతీయ స్థాయిలో కబడ్డీకి గుర్తింపు తీసుకురావడానికి, రాబోయే తరాలకు ఈ క్రీడ ప్రాధాన్యం తెలియజేయడానికి చేస్తున్న కృషిలో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే వేరే వర్గం తమ కార్యవర్గానికి గుర్తింపు ఇవ్వాలంటూ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించిందని తెలిపారు. వారు అనుమతి ఇవ్వకపోవడంతో ఏపీ హైకోర్టులో కేసు వేశారన్నారు. సుమారు నాలుగేళ్లుగా విచారణ కొనసాగిన అనంతరం, కోర్టు ఆదేశాల మేరకు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎస్‌టీ గార్క్ రెండు కార్యవర్గాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారని వివరించారు. అనంతరం తమ కార్యవర్గానికి గుర్తింపు ఇచ్చారని, దీంతో వివాదం సద్దుమణిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఈ గుర్తింపు తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడను నిలబెడతామని ఆనందం వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్, సీఆర్‌సీ కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, సీఆర్‌సీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఎన్.వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.