
స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న జేసీ తేజ్ భరత్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి, 1902 కాల్ సెంటర్‌కు వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డీఆర్‌ఓ, ఇతర జిల్లా అధికారులతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన ప్రజల నుంచి 113 అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన అర్జీలను ఆర్థిక, ఆర్థ్ధికేతర అంశాల వారీగా విశ్లేషణ చేసుకోవాలన్నారు. వాటిని గడువులోగా పరిష్కరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 400 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
వికాసలో టెక్నీషియన్
ఉద్యోగానికి ఇంటర్వ్యూ
కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో మంగళవారం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టెక్నీషియన్ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు సోమవారం తెలిపారు. ఈ ఉద్యోగానికి ఐటిఐ ఫిట్టర్ ఒక సంవత్సరం అప్రంటీస్‌షిప్ (ఎన్‌సివిటీ) కలిగిన ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పురుష అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం ఉంటుందన్నారు. ఎంపికై న వారు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 28వతేదీ మంగళవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్ జెరాక్స్ కాపీలతో హాజరుకావలెనని పీడీ వివరించారు.
జగన్మోహినీ కేశవ స్వామి
దీక్షలు ప్రారంభం
ఆత్రేయపురం: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ర్యాలి శ్రీ జగన్మోహినీ కేశవస్వామి వారి దీక్షలను ఆలయంలో సోమవారం ప్రారంభించారు. కల్యాణోత్సవాల సందర్భంగా పలువరు భక్తులు ఏటా ఇక్కడ స్వామి వారి మాల వేసుకుంటారు. ఈ నెల 30 నుంచి జరిగే స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా సుమారు 70 మంది మాలధారణ గావించారని ఈఓ బి.కృష్ణచైతన్య తెలిపారు. వారికి దేవస్థానం తరఫున దీక్షా వస్త్రాలు, మాలలు, మధ్యాద్యాహ్నం భిక్ష, ఉదయం సాయంత్రం పడి, వసతి ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 30 నుంచి వారం రోజుల పాటు జరిగే స్వామి వారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
వంతెన నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి
సాక్షి, అమలాపురం: పి.గన్నవరం మండలం గంటి పెదపూడి – ఊడిమూడిలంక వంతెన నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. వంతెన నిర్మాణ పనులపై పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఏపీఈపీడీసీఎల్ అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. అనుకూలమైన ప్రాంతాల్లో లంకలకు పెద్ద వంతెన, కాలువ మీద చిన్న వంతెన నిర్మాణ పనులు చేయాలని సూచించారు. వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేలా భూసేకరణ విషయంలో రెవెన్యూ, అడ్డంగా ఉన్న హెచ్‌టీ లైన్ తొలగింపునకు విద్యుత్ అధికారులు సహకరించాలని ఆదేశించారు. కాలువలు మూసివేసిన తరు వాత అవసరమైతే రావులపాలెం, పి.గన్నవరం మధ్య ట్రాఫిక్ మళ్లించి కాలువపై చిన్న వంతెన నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ శుక్లా ఆదేశించారు.

27ఆర్‌వీపీ44: జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో దీక్షలు ప్రారంభించిన భక్తులు