
● పీఏసీఎస్‌లలోనూ ఇక బదిలీలు
● తిష్ట వేసిన ఉద్యోగులకు స్థానచలనం
● త్వరలో జిల్లా స్థాయి కమిటీ భేటీ
● 3 నెలల్లో తుది నిర్ణయం
● సొసైటీల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సహకార సంఘాల్లో ఒకే చోట ఏళ్ల తరబడి పని చేస్తామంటే ఇకపై కుదరదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) పని చేసే ఏ స్థాయి ఉద్యోగికై నా బదిలీ తప్పదు. నిర్దేశించిన మూడేళ్ల కాలపరిమితి దాటిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందే. నియామకం దగ్గర నుంచి ఉద్యోగ విరమణ వరకూ ఒకే సొసైటీలో పని చేస్తున్న విధానం ఇంతవరకూ కొనసాగుతోంది. సహకార సంఘాలు వేలాది మంది రైతుల ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న వ్యవస్థ. బదిలీలు లేకపోవడంతో సొసైటీలు కోట్లాది రూపాయల కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ ఏలుబడిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోట్లాది రూపాయల మేర అవినీతి, అక్రజుమాలు చోటుచేసుకున్నాయి.
అక్రమాల కట్టడి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పఏసీఎస్‌లలో ఏళ్ల తరబడి ఉద్యోగులు తిష్ట వేయడమే ఈ అవినీతికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా ఇప్పుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)లు, వాటి బ్రాంచిలలో అమలు చేస్తున్న హెచ్‌ఆర్ పాలసీ అమలులోకి తీసుకురానున్నారు. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌లలో ఎంత మంది ఉద్యోగులు, ఎంత కాలం నుంచి పని చేస్తున్నారు, ట్రాక్ రికార్డు వంటి అంశాలపై తాజాగా ఆరా తీస్తున్నారు. వేళ్లూనుకుపోయిన అవినీతి అక్రమాలకు కళ్లెం వేయనున్నారు.
వివిధ విషయాలపై భేటీ
పీఏసీఎస్‌లలో బదిలీలపై త్వరలో జిల్లా స్థాయి అమలు కమిటీ భేటీ కానుంది. కమిటీలో డీసీసీబీ చైర్మన్, సీఈఓ, జిల్లా సహకార అధికారి సభ్యులుగా ఉన్నారు. సహకార సంఘాల ఉద్యోగుల బదిలీలు, సర్వీసు రూల్స్, నష్టాల్లో ఉన్న సంఘాల ఉద్యోగులకు జీతాల చెల్లింపు, రెండేళ్లలో తిరిగి చెల్లించేలా అడ్వాన్సులు ఇవ్వడం తదితర అంశాలపై చర్చించనున్నారు. తరువాత హెచ్‌ఆర్ పాలసీపై కమిటీ ఒక నిర్ణయానికి రానుంది. ప్రస్తుతం డీసీసీబీల్లో బ్రాంచి మేనేజర్ నుంచి సూపర్‌వైజర్లు సహా అన్ని క్యాడర్ల వారికీ బదిలీలు జరుగుతున్నాయి. ఎటొచ్చీ పీఏసీఎస్‌లలో ఉద్యోగులకే బదిలీలు లేవు. ఫలితంగా రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన ఈ సహకార సంఘాల్లో అవినీతి రాజ్యమేలుతూ వస్తోంది.
కసరత్తు ప్రారంభం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వద్దిపర్రు, రావులపాలెం, రామచంద్రపురం; కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, లంపకలోవ, కిర్లంపూడి, గోకవరం, సీతానగరం, కానవరం, గండేపల్లి, జగ్గంపేట, భూపాలపట్నం తదితర సహకార సంఘాల్లో బినామీ పేర్లతో రికార్డులు తారుమారు చేసి కోట్లాది రూపాయలు దారిమళ్లించి, రైతుల నోట మట్టి కొట్టిన బాగోతాలు తెలిసిందే. గత చంద్రబాబు సర్కార్‌లో జరిగిన ఈ కుంభకోణాల్లో డీసీసీబీ పాలకవర్గం సహా సీఈఓ, ఇతర ఉన్నతాధికారుల పాత్రపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 51, సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఈఓ సహా పలు స్థానాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్ట వేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం గుర్తించింది. సంఘాల స్థాయిలోనే ప్రక్షాళన జరగాలంటే ఉద్యోగుల బదిలీలకు రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌ఆర్ పాలసీ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు చేపట్టిన కసరత్తు మే లేదా, జూన్ నెలాఖరుకు కొలిక్కి వస్తుందని సమాచారం.
అడ్డుకట్టకు దోహదం
పీఏసీఎస్‌లలో హెచ్‌ఆర్ పాలసీ తీసుకురావాలనేది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. సహకార వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో అవకతవకలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇది దోహదపడుతుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా సొసైటీలలో బినామీ రుణాలతో రైతులను నిలువునా ముంచేసిన వ్యవహారాలకు ఈ పాలసీ లేకపోవడమే ప్రధాన కారణం. ఇది ఎప్పుడో జరగాల్సింది. ఈ విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లాం. త్వరలో ఇది అమలులోకి వస్తుందని ఎదురు చూస్తున్నాం.
– జున్నూరి వెంకటేశ్వరరావు (బాబీ),
రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యుడు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో...
సహకార సంఘాలు : 299
నష్టాల్లో ఉన్న సంఘాలు : 100కు పైనే
సంఘాల్లో ఉద్యోగులు : 1350 మంది

లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం
