నేటి నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు

Mar 28 2026 7:25 AM | Updated on Mar 28 2026 7:25 AM

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చైత్ర శుద్ధ దశమి శనివారం నుంచి బహుళ పాడ్యమి వరకు జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ పాలకమండలి చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 28న అంకురార్పణ, 29న ధ్వజారోహణం, రథోత్సవం, రాత్రి కల్యాణం, 30న పొన్న వాహన సేవ, 31న సదస్యం, ఏప్రిల్‌ 1న జల విహారోత్సవం, 2న చక్రస్నానం, 3న పుష్పోత్సవం నిర్వహిస్తారు.

మస్కట్‌ నుంచి

క్షేమంగా స్వగ్రామాలకు..

కేసీఎం చొరవతో వచ్చిన బాధితులు

అమలాపురం రూరల్‌: మస్కట్‌ వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరి మహిళలను కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ చొరవతో కేసీఎం అధికారులు కోనసీమకు సురక్షితంగా తీసుకు వచ్చారు. గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన బీరా శేషారత్నం గత ఏడాది ఆగస్టులో, పోతవరం గ్రామానికి చెందిన గుమ్మల్ల శ్రీలక్ష్మి అదే ఏడాది సెప్టెంబర్‌లో మస్కట్‌ వెళ్లారు. శేషారత్నం పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో మధుమేహానికి గురై అనారోగ్యం పాలైంది. దీంతో కాలికి గాయమై పరిస్థితి విషమించింది. పని చేయలేని స్థితిలో ఆమెను యజమానులు సంబంధిత కార్యాలయానికి అప్పగించారు. ఆమెను పంపిన ఏజెంట్‌ను సంప్రదించగా, భారతదేశానికి పంపేందుకు నిరాకరించారు. కోనసీమ సెంటర్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (కేసీఎం)ను సంప్రదించగా అధికారులు ఏజెంట్‌తో మాట్లాడి ఆమెను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు. అలాగే లక్ష్మి మొదట ఒక ఇంటిలో పనికి చేరినప్పటికీ, పని నచ్చకపోవడంతో తిరిగి ఏజెంట్‌కు అప్పగించారు. అనంతరం మరో ఇంటిలో కుదిరి బుద్ధి మాంధ్యం ఉన్న బాలుడి బాగోగులు చూడాల్సి వచ్చింది. అక్కడ ఆమెకు పలు ఇబ్బందులు రావడంతో ఆమెను ఏజెంట్‌కు అప్పగించారు. అతడు రూ.2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విషయం తెలుసుకున్న కేసీఎం సభ్యులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్‌ బీబీ సఫియా పాల్గొన్నారు.

15 ప్రైవేటు బస్సులపై కేసులు

రూ.74,800 అపరాధ రుసుము వసూలు

రావులపాలెం: నిబంధనలు పాటించని బస్సులను సీజ్‌ చేసి ఫిట్‌నెస్‌ రద్దు చేస్తామని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు అన్నారు. ఈతకోట టోల్‌ ప్లాజా వద్ద శుక్రవారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 15 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.74,800 అపరాధ రుసుము విధించినట్టు డీటీఓ తెలిపారు.

నాలుగు పశువులపై పులి పంజా

దేవీపట్నం: నెల రోజులకు పైగా జిల్లా వాసులను వణికిస్తున్న పులి గురువారం రాత్రి దేవీపట్నం మండలంలోకి ప్రవేశించింది. ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి గ్రామం వద్ద కట్టి ఉంచిన వీరపాటి కొండబాబుకు చెందిన మూడు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. మరో చూడి ఆవును చంపి, కొంత మేర ఈడ్చుకుపోయి తినేసింది. జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా ఈ పులి కొత్తవీధి సమీపాన ఉన్నట్లు అటవీ సిబ్బంది శుక్రవారం ఉదయం గుర్తించారు. వెంటనే తిరుపతి నుంచి వచ్చిన టీమ్‌, హనుమ టీమ్‌, స్థానిక అటవీ సిబ్బంది బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ పులికి మత్తు మందు ఇచ్చేందుకు మాటు వేశారు. అయితే, అక్కడి పొదల్లో సేద తీరుతున్న పులి మధ్యాహ్నం 3 గంటలకు సమీపంలోని ఈనుకొండ వైపు మళ్లిపోయింది. దీంతో, పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం అందిస్తామని ఇందుకూరు అటవీ రేంజ్‌ అధికారి కొండలరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ పులి శుక్రవారం రాత్రికి తిరిగి రంపచోడవరం మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ముస్తాబైన వాడపల్లి వెంకన్న ఆలయం

27ఆర్‌వీపీ41:

27ఆర్‌వీపీ42: వాడపల్లి వేంకటేశ్వరస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement