బ్లాక్‌స్పాట్లలో భద్రతా చర్యలు | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌స్పాట్లలో భద్రతా చర్యలు

Mar 28 2026 7:25 AM | Updated on Mar 28 2026 7:25 AM

ప్రమాదాలు జరుగుతున్న

ప్రాంతాల్లో అధికారుల పరిశీలన

స్థానికులతో మాట్లాడి

అభిప్రాయాలు, సూచనల సేకరణ

ఆలమూరు: 216ఏ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ రావు, హైవే ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో రావులపాలెం–ఆలమూరు మండలం పొట్టిలంక వరకూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రూరల్‌ సిఐ సీహెచ్‌ విద్యాసాగర్‌, ఆలమూరు ఎస్సై జి.నరేష్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ రహదారిలోని జొన్నాడ వద్ద కోటిపల్లికి వెళ్లే ఏటిగట్టు రోడ్డు, ఆంజనేయస్వామి గుడి, మూలస్థాన అగ్రహారం సెంటర్‌, చొప్పెల్ల లాకులు, చెముడులంక, మడికి గ్రామాల్లో ఆరు ప్రమాదకర ప్రదేశాలు (బ్లాక్‌ స్పాట్లు)ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలలో దుర్ఘటనలకు కారణాలను స్థానికులను అడిగి నష్ట నివారణ కోసం తీసుకోవలసిన చర్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో చర్చించారు.

జంక్షన్ల వద్ద అధిక ప్రమాదాలు

216ఏ జాతీయ రహదారి వెంబడి ఉన్న జంక్షన్లలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు తగిన ప్రణాళికను రూపొందించి సత్వర కార్యాచరణను రూపొందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మురళీమోహన్‌, పీడీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. హైవే టీం లీడర్‌ ఎ.శ్రీనివాసు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కె.బాలసుబ్రమణ్యం, రూట్‌ మేనేజర్‌ పి.రమేష్‌, టోల్‌ మేనేజర్‌ కేవీవీఎస్‌ఎన్‌ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement