యానాం చేరుకున్న గోదావరి పరిక్రమ యాత్ర
యానాం: దేశంలోని దాదాపు 300 మంది సాధువులు, సత్పురుషులు మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రారంభమైన గోదావరి పరిక్రమ (ప్రదక్షిణ) యాత్ర శుక్రవారం యానాం చేరుకుంది. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నాసిక్ వద్ద ప్రారంభమైన యాత్ర కాళేశ్వరం, భద్రాచలం, రాజమహేంద్రవరం మీదుగా సాగింది. శనివారం తెల్లవారు జామున యానాం నుంచి బయలుదేరి అంతర్వేది చేరుకుంటామని వారు తెలిపారు. అక్కడి నుంచి నాసిక్‌కు తిరిగి వెళ్తామని వివరించారు. వీరంతా సుమారు 40 వాహనాల్లో యానాం వచ్చారు. స్థానిక శంకర్ రెసిడెన్సీ, కాపు కల్యాణ మండపంలో వీరికి బస ఏర్పాటు చేశారు. సాధువులను, పీఠాధిపతులను ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్ కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. పండ్లు, ఫలహారాలు అందజేశారు.


