కూటమి దందా..
సాక్షి, అమలాపురం/రావులపాలెం: జిల్లాలో చెప్పుకునే స్థాయిలో నిర్మాణాలు లేవు, వరదల నేపథ్యంలో ఇసుక నిల్వలను భారీగా చేశారు. ఇప్పుడు పెద్దగా డిమాండ్ లేదు. అయినా కూటమి నేతల ఇసుక దోపిడీ నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు.
కొనసాగుతున్న వరద
గోదావరిలో నవంబర్‌లో కూడా వరద పోటు కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1,60,380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రవాహ తీరు చూస్తుంటే ఈ నెలాఖరు వరకు వరద తగ్గి, ఇసుక ర్యాంపులు తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కారణంతో కూటమి నేతలు ఇసుక ధరను పెంచేస్తున్నారు. నిల్వ ఉంచిన ఇసుక కొండలను అమ్ముకొని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కూటమి నాయకులు, సిండికేట్‌దారులు కలిసి చేస్తున్న దోపిడీతో జిల్లాలో కొండలుగా పెట్టిన ఇసుక రోజురోజుకూ తరిగి పోతోంది.
సిండికేట్ల హవా
ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సిండికేట్ల హవా నడుస్తోంది. వారికి అధికారులు, కూటమి నేతల దన్ను ఉండడంతో స్టాక్ పాయింట్ల వద్ద వారు పాడిందే పాటగా మారింది. గత జూన్ నెలలో జిల్లాలో 20 మాన్సూన్ (వర్షాకాలపు) స్టాక్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 14 ఆయా ఇసుక ర్యాంపుల వద్ద ఏర్పాటు చేయగా, మిగిలిన ఆరు పాయింట్లలో నాలుగు జాతీయ రహదారులకు సమీపంలో, రెండు వివిధ ప్రాంతాలలో ఉంచారు. వీటిలో 10,00,356 మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశారు. ఈ నిల్వలలో సుమారు 7,82,789 మెట్రిక్ టన్నుల ఇసుకను ఆరు స్టాక్ పాయింట్ల వద్ద ఉంచగా, మిగిలిన 2,17,567 మెట్రిక్ టన్నుల ఇసుకను 16 ఇసుక ర్యాంపులు వద్ద అందుబాటులో ఉంచారు.
పూర్తవుతున్న విక్రయాలు
జిల్లాలోని 14 ఇసుక ర్యాంపుల వద్ద ఉన్న స్టాక్ పాయింట్లలో ఇసుక విక్రయాలు దాదాపు పూర్తయ్యాయి. అలాగే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న జొన్నాడ, ఆలమూరుకు సంబంధించి మందపల్లి స్టాక్ పాయింట్‌లో ముగిశాయి. రావులపాలెం మండలం రావులపాడు, గోపాలపురం, అమలాపురం మండలం కామనగరువు, ఆలమూరు వద్ద స్టాక్ వద్ద మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటిలో రావులపాడులో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉండగా, ఇప్పటికే సగం పూర్తయ్యింది. గోపాలపురం వద్ద 81,239 టన్నుల ఇసుక నిల్వ ఉంచగా సగం అమ్మకాలు జరిగాయి.
బహిరంగంగా..
జిల్లాలో ఇంకా 3.20 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఇంకా అధికంగా ఇసుక విక్రయాలు జరిగాయి. టన్ను ఇసుకకు అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ఐదు యూనిట్ల లారీ అంటే సుమారు 18 టన్నుల ఇసుక విక్రయించాల్సి ఉంది. కానీ ఇక్కడ 20 టన్నులు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం 20 టన్నుల ఇసుక ధర రూ.6,200 ఉండాల్సి ఉంది. లారీకి రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు ఒక్కొక్క స్టాక్ పాయింట్ వద్ద ధర నిర్ణయించి విక్రయిస్తూ బహిరంగ దోపిడీకి దిగారు.
ధర పెంచి దోపిడీ
ర్యాంపుల సమీపంలో ఉన్న స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక ధర రూ. 64 నుంచి రూ.154 వరకు ఉంది. రావులపాలెం మండలం గోపాలపురం ర్యాంపు వద్ద ఉన్న స్టాక్ పాయింట్‌లో రూ.64.05, ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో 107.10, ఊబలంక –1 వద్ద రూ.131.25, ఊబలంక –2 వద్ద రూ.121.80 చొప్పున ర్యాంపులను బట్టి ధర నిర్ణయించారు. అత్యధికంగా ఆత్రేయపురం మండలం పులిదిండి ర్యాంపు వద్ద ఉన్న స్టాక్ పాయింట్‌లో రూ.155.40గా నిర్ణయించారు. ఇదే జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న స్టాక్ పాయింట్లకు గరిష్టంగా రూ.310 ధరను అధికారులు ప్రకటించారు. దీని వెనుక సిండికేటు చక్రం తిప్పింది. దీనిని చూపించి ర్యాంపుల వద్ద ఉన్న స్టాక్ పాయింట్లలో కూడా టన్నుకు రూ.310 చొప్పున వసూలు చేసి దోపిడీ చేశారు.
జిల్లాలో ఇసుక ధరకు రెక్కలు
దోపిడీని ఆపని అక్రమార్కులు
ఐదు యూనిట్ల లారీకి అదనంగా రూ.2,800 వరకూ వసూలు
డిమాండ్ తగ్గినా పెరుగుతున్న రేటు
గోదావరిలో ఇప్పటికీ వరద ఉధృతి
నెలాఖరు వరకూ తెరచుకోని ర్యాంపులు


