వందేమాతరంతో ఉద్యమ స్ఫూర్తి
అమలాపురం రూరల్: వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి అన్నారు. వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్, ఆ గేయ రచయిత బంకించంద్ర చటర్జీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వందేమాతరం పూర్తి గీతాన్ని కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు ఆలపించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాధవి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రణనినాదంలా ఈ గేయం నిలిచిందన్నారు. యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందన్నారు. స్వతంత్ర సమర యోధులకు మనోబలాన్ని చేకూర్చిందని, బ్రిటీషర్లను ఎంతో భయపెట్టిందన్నారు. కార్యక్రమంలో డీఐపీఆర్‌ఓ సీహెచ్ శ్రీనివాస్, సెక్షన్ సూపరింటెండెంట్లు సుబ్బ రాజు, రమణ కుమారి, నాగ లక్ష్మమ్మ, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్, కలెక్టరేట్ సిబ్బంది భరత్, వంశీ పాల్గొన్నారు.
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నివారణ
కరప: ఆరోగ్య నియమాలు పాటిస్తూ ముందస్తు పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు అనుసరిస్తే క్యాన్సర్ నివారించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.నరసింహనాయక్ పేర్కొన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం నడకుదురు ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో క్యాన్సర్‌పై ఉన్న అపోహలు తొలగించాలన్నారు. క్యాన్సర్ నివారణకు నిర్వహిస్తున్న ముందస్తు పరీక్షలపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలన్నారు. ముందుగానే స్క్రీనింగ్ చేయించుకుని, తదుపరి జరిపే చిన్నపరీక్ష ద్వారా క్యాన్సర్ నిర్ధారించి, నివారణకు మందులు ఇవ్వడం జరుగుతుందని డీఎంహెచ్‌ఓ వివరించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో నిర్వహించిన జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత ఫ్రైడే డ్రైడేలో ఆయన పాల్గొని పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కేవీ సుబ్బరాజు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ.ప్రభాకర్, జిల్లా ఎన్‌సీడీ నోడల్ అధికారి డాక్టర్ వి.అరుణ, కరప పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వి.ఏంజలిన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
‘శివసదన్’కు
రూ.10 లక్షల విరాళం
అన్నవరం: రత్నగిరిపై సత్రం డోనార్ స్కీం కింద శివసదన్ సత్రంలో ఒక గదికి కాకినాడకు చెందిన ములకల సుబ్బారావు, కనకదుర్గ దంపతులు రూ.పది లక్షలు విరాళంగా సమర్పించారు. ఆ మేరకు చెక్కును శుక్రవారం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు అందజేశారు. దాత దంపతుల అభీష్టం మేరకు ఈ పథకం కింద ఆ సత్రంలో గదిని కేటాయించడంతో బాటు పలు ప్రయోజనాలు, ఆలయంలో గౌరవ మర్యాదలు లభించేలా చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు.
వందేమాతరంతో ఉద్యమ స్ఫూర్తి
వందేమాతరంతో ఉద్యమ స్ఫూర్తి


