పేదలకు వైద్యం దూరం చేసేందుకు కుట్ర
పి.గన్నవరం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి, పేదలకు వైద్యం దూరం చేసేందుకు కూటమి పాలకులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పేదల విద్య, వైద్యం కోసం నాడు జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకువస్తే, నేడు సీఎం చంద్రబాబు నాయుడు వాటిని అనుయాయులకు అమ్మేస్తున్నారన్నారు. ఇటువంటి చారిత్రాత్మకమైన తప్పు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పైవేటీకరణను నిరసిస్తూ మండలంలోని ఊడిమూడిలో కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపేటలో పార్టీ మండల అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు జగన్ అందించిన సేవలను జగ్గిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్న లక్ష్యంతో జగన్ 850 ఎకరాల్లో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. వాటిని ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబుపై తిరుగుబాటు చేయాలన్నారు. మోంథా తుపాను బాధితులకు కూటమి ప్రభుత్వం సాయం అందించడం లేదని, కేవలం కూటమి నాయకుల ఇళ్లకే పరిమితం అవుతోందన్నారు. కో ఆర్డినేటర్ గన్నవరపు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, మందపాటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని అన్నారు. జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, నక్కా వెంకటేశ్వరరావు, మండల శాఖల అధ్యక్షుడు కొమ్ముల రాము, మేడిశెట్టి శ్రీనివాస్, నాయకులు గిడ్డి రాంబాబు, పందిరి పూర్ణచంద్రరావు, రాణి శ్రీధర్,కొర్లపాటి కోటబాబు, పాముల దేవీ ప్రకాష్, పి.కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు, లోకేష్‌లు
ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉధృత ఉద్యమం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి


