సమ్మెటివ్ పరీక్షలకు మోగిన సైరన్
● ఈ నెల 10 నుంచి 19 వరకూ నిర్వహణ
● 1 – 10 తరగతులకు
ఎస్‌సీఈఆర్‌టీ ప్రశ్నపత్రాలు
● జిల్లాలో 1.96 లక్షల మంది విద్యార్థులు
రాయవరం: విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఏటా పరీక్షలు నిర్వహిస్తుంటారు. వాటిలో భాగంగా ఇప్పటికే ఫార్మేటివ్ అసెస్‌మెంట్–1, 2 పరీక్షలను ముందుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరిపారు. ఇప్పుడు తాజాగా సమ్మెటివ్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్–1 పరీక్షలు జరుగుతాయి. అన్ని తరగతులకు ఎస్‌సీఈఆర్‌టీ నుంచి ప్రశ్నపత్రాలను సరఫరా చేశారు. వీటిని బైలింగ్విష్ విధానంలో రూపొందించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలతో పాటు, అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు తప్పనిసరిగా సమ్మెటివ్–1 పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి. దీని కోసం విద్యాశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాలపై ప్రతి జిల్లాకు సీక్రెట్ క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. పరీక్ష పేపర్లను ఎవరు లీక్ చేసినా, ఏ పాఠశాల నుంచి లీక్ అయినా ఆ విషయం క్షణాల్లో బయట పడే అవకాశం ఉండేలా చర్యలు చేపట్టారు.
పరీక్షల షెడ్యూల్
● 1–5 తరగతులకు 11న ఓఎస్‌ఎస్‌సీ, 12న ఫస్ట్ లాంగ్వేజ్, 13న ఇంగ్లిషు, 14న గణితం, 15న ఈవీఎస్ (3–5 తరగతులు) పరీక్షలు నిర్వహిస్తారు.
● 6–10 తరగతులకు 10న కాంపోజిట్ కోర్సు పేపరు–2, 11న ఓఎస్‌ఎస్‌సీ పేపరు–2, 12న ఫస్ట్ లాంగ్వేజ్, 13న సెకండ్ లాంగ్వేజ్, 14న ఇంగ్లిషు, 15న గణితం, 17న ఫిజికల్ సైన్స్, 18న బయలాజికల్ సైన్స్, 19న సోషల్ స్టడీస్ పేపర్లు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 90,916 మంది 1–5 తరగతుల విద్యార్థులు, 1,05,491 మంది 6–10 తరగతుల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వీటిని నిర్వహిస్తారు.
మండల కేంద్రాలకు పేపర్ల పంపిణీ
జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారానే సమ్మెటివ్ –1 పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష పేపర్లు డీసీఈబీ ద్వారా మండల విద్యా కేంద్రాలకు చేరవేశారు. సంబంధిత ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పేపర్లకు కస్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల తేదీల వారీగా ప్రశ్నపత్రాలను పది పబ్లిక్ పరీక్ష పేపర్ల మాదిరిగానే ట్రంకు బాక్సుల్లో భద్రపరిచారు.
పకడ్బందీ చర్యలు
సమ్మెటివ్–1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రశ్నపత్రాల స్టోరేజీ, పంపిణీ, భద్రత, పరీక్షల నిర్వహణ అంశాల్లో పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేశాం. ఎవరైనా పరీక్ష పేపర్లను ముందుగా లీకేజీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.
– షేక్ సలీం బాషా, డీఈవో
షెడ్యూల్ ప్రకారమే..
ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థలన్నీ షెడ్యూల్ ప్రకారమే సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వహించాలి. పరీక్ష పేపర్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య జాగ్రత్త పర్చాలి. ఏ రోజు పేపరు ఆ రోజునే పరీక్షకు గంట ముందు మాత్రమే సీల్ వేసిన బాక్సుల నుంచి బయటకు తీయాలి. పబ్లిక్ పరీక్షల మాదిరిగానే ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహించాలి.
– బీర హనుమంతరావు, డీసీఈబీ కార్యదర్శి
పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులు
సమ్మెటివ్ పరీక్షలకు మోగిన సైరన్
సమ్మెటివ్ పరీక్షలకు మోగిన సైరన్


