ఐ.పోలవరం: రైతు కష్టం నీట మునిగింది.. మోంథా తుపానుతో కురిసిన భారీ వర్షాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యాన పంట చేలల్లోకి నీరు చేరింది.. ప్రధానంగా కోకో, కూరగాయ పంటలు ముంపు బారిన పడ్డాయి. ఈదురు గాలులకు చెట్లు దెబ్బతిన్నాయి. అయితే ముంపు నీరు సకాలంలో తొలగిస్తే ఈ పంటలకు పెద్దగా నష్టం వాటిల్లదని జిల్లా ఉద్యాన శాఖ అధికారి బీవీ రమణ తెలిపారు. ఆయా తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే...
కోకో తోటలు లోతట్టు ప్రాంతాల్లో ఉంటే తోట చుట్టూ కందకాలను తవ్వడం ద్వారా మురుగు నీటి వసతి కల్పించడం వల్ల చెట్టు కుళ్లిపోకుండా చేయడంతో పాటు భూమి కోతకు గురవ్వకుండా చూసుకోవచ్చు. తుపాను కారణంగా ఈదురు గాలుల బారిన పడిన తోటల్లో విరిగిన కోకో చెట్ల కాండం, ఫ్యాన్ కొమ్మలను పదునైన కత్తి లేదా రంపం సాయంతో కత్తిరించాలి. కత్తిరించిన భాగాలను 1 శాతం బోర్డో మిశ్రమం లేదా మూడు శాతం కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్‌తో పూయాలి. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు వచ్చే ఫైటోఫోరా కాయకుళ్లు, గజ్జి తెగులును నివారించేందుకు ఒక శాతం బోర్డో మిశ్రమం, కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి కొమ్మలు, ఆకులపై పిచికారీ చేయాలి. అదే విధంగా గజ్జి తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బోర్డ్ పెస్ట్‌ను కాండంపై పూతలా వేయాలి.
ఫ నీటి ముంపునకు గురైన కోకో తోటల్లో భూమి ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్ర తెగుళ్ల నివారణకు ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా 0.3 శాతం కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని చెట్టుకు 3 లీటర్ల చొప్పున మొదలు వద్ద నేలను తడపాలి.
ఫ కోకో తోటలలో పిందె పడిపోకుండా ఉండడానికి, కాయకుళ్లు తెగులు నివారణకు 1 శాతం బోర్డో మిశ్రమం లేదా 0.3% కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
ఫ ఆకులు పండు బారిన కోకో తోటల్లో చెట్లపై 0.5 శాతం చొప్పున 13:0:46 లేదా 19:19:19 వంటి నీటిలో కరిగే రసాయన ఎరువులను వారం నుంచి పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి.
ఫ నీరు నిలిచిన తోటల్లో తరచూ ఆకులపై కనిపించే ఇనుము, జింకు ధాతు లోప నివారణకు 0. 5 శాతం ఫెరరస్ సల్ఫేట్, 0.25 శాతం జింక్ సల్ఫేట్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.
ఫ తోటలు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే మొక్క మొదలు మట్టిని వేస్తుండాలి. పడిపోయిన మొక్కల వేరు దెబ్బతినకుండా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి.
ఫ మొక్కలు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే, సిఫారసు చేసిన దానికంటే ఎక్కువగా మరో మోతాదు ఎరువులను (100:40:140 గ్రాముల ఎన్‌పీకే) ఒక్కో మొక్కకు వేయాలి.
ఫ ముంపు తొలగిస్తేనే కోకో,
కూరగాయ పంటలకు మేలు
ఫ జిల్లా ఉద్యానశాఖ అధికారి రమణ వెల్లడి
కూరగాయ పంటల్లో ఇలా చేద్దాం
కూరగాయల తోటలు, పొలాల్లో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపివేయాలి. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను పంటపై పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషకాలను కూడా పిచికారీ చేసుకోవాలి. నేల కొంచెం ఆరిన తరువాత రసాయన ఎరువులను నేలలో వేసుకోవాలి. అధిక వర్షాలను విత్తనం మొలకెత్తనప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలో నారు పెంచుకుని సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. వర్షాలు ఆగిన వెంటనే అంతర సేద్యం చేసే కలుపును తొలగించడమే కాకుండా నేల త్వరగా ఆరేటట్లు చూసుకోవాలి.
సస్యరక్షణ చర్యలు
ఫ ఆకు తినే పొగాకు లద్దెపురుగు నివారణకు విషపు ఎరలను (అన్ని కూరగాయ పంటలు) ఉపయోగించాలి.
ఫ అక్షింతల పురుగు, చిత్త పురుగు నివారణకు వర్షాలు ఆగిన వెంటనే క్లోరిఫైరిఫాస్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటిలో, లేదా థయోడికార్బ్ ఒక గ్రాము లీటరు నీటిలో పిచికారీ చేయాలి. (ముఖ్యంగా వంగ, కాకర, ఆకాకర)
ఫ ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి లేదా మెటాలాక్సిల్ మంకోజెబ్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి మొక్కల మొదళ్లలో వేయాలి (మిరప, టమోటా, క్యాబేజీ వంటి వాటికి).
ఫ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం ఒక గ్రాము లీటరు నీటికి, లేదా మంకోజెబ్ 2.5 గ్రాము లు ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి (మిరప, టమోటా, చిక్కుడు, ఆకుకూరలు).
ఫ బూజు తెగులు నివారణకు డైమిథోమర్స్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి, లేదా మెటాలాక్సిల్, మంకోజెబ్ కలిపి రెండు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. (బీర, కాకర దోస, పొట్ల, సొర)
ఫ బాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందు ఒక లీటరు నీటికి, ప్లాంటామైసిన్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. (టమోటా, వంగ, క్యాప్సికం)
అంతోటా సస్యరక్షణ
అంతోటా సస్యరక్షణ
అంతోటా సస్యరక్షణ


