పునరావాసాలకు తరలింపులో అలసత్వం వద్దు
– కలెక్టర్ మహేష్‌కుమార్
మలికిపురం: మోంథా తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో అలసత్వం వద్దని కలెక్టర్ ఆర్.మహేశ్‌కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం ఆయన రాజోలు నియోజకవర్గం కేశనపల్లిలో పర్యటించి తుపాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ప్రత్యేకాధికారి విజయ రామరాజు తో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఆహారం తయారీ, వసతి, ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రాథమిక వైద్య శిబిరంలో ఔషధాల పంపిణీని పరిశీలించారు. మంగళవారం తీవ్ర తుపానుగా మారి రాత్రికి తీరాన్ని దాటే అవకాశముందన్నారు. సుమారు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని ఎవరూ అశ్రద్ధగా ఉండవద్దన్నారు. ప్రత్యేకాధికారి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు అందించేందుకు సంసిద్ధంగా ఉందని అత్యవసర పరిస్థితులలో వీరి సహకారం పొందాలన్నారు. కోస్తా తీరం వెంబడి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ సచివాలయాల వరకు 24/7 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేస్తూ కమ్యూనికేషన్ వ్యవస్థ నిరంతరాయంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కే ప్రభాకర్, మండల ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.


