పంట రుణాలు మాఫీ చేయాలి
అల్లవరం: తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వారి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు చింతా అనురాధ డిమాండ్ చేశారు. ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం గ్రామాల్లో తుపాను బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. అక్కడి బాధితులతో మాట్లాడి, సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం మాజీ ఎంపీ మాట్లాడుతూ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వేల ఎకరాల్లో వరి, అరటి, బొప్పాయి, కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు, రూ.5 వేలు ఏ పాటికి సరిపోవన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ కొనుకు గౌతమి, సర్పంచ్ రాకాప విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకుడు మాల్లాడి ఉమా మహేశ్వరరావు తదితరులు ఉన్నారు.
నేటి నుంచి
కళాశాలల ప్రారంభం
అమలాపురం టౌన్: తుపాను ప్రభావం తగ్గడంతో గురువారం నుంచి జిల్లాలోని జూనియర్ కళాశాలలు, హైస్కూలు ప్లస్ విద్యా సంస్థలు యథాతథంగా తెరుచుకోనున్నాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. తుపాన్ కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని జూనియర్ కళాశాలలు, హైస్కూలు ప్లస్ విద్యా సంస్థలకు సోమ, మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించామన్నారు. కొత్తపేట, మండపేట, అయినవిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తుపాన్ బాధితుల కోసం పునరాస కేంద్రాలుగా ఇచ్చామన్నారు.
పంట అంచనాలు
తక్షణమే రూపొందించాలి
అమలాపురం టౌన్: మోంథా తుపాను కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టంపై అంచనాలను తక్షణమే రూపొందించి, ప్రకటించాలని రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ కె.సత్తిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన అమలాపురంలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడి అంచనాల ప్రకారం 20 వేల ఎకరాల్లో పంట నష్ట పోయిందని ప్రకటించారని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు సాగు చేస్తున్న రైతులు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. వాటిపై నివేదిక తయారు చేసి, నష్టపరిహారం అందించాలని కోరారు.


