ముప్పు తప్పినా.. | - | Sakshi
Sakshi News home page

ముప్పు తప్పినా..

Oct 30 2025 9:22 AM | Updated on Oct 30 2025 9:22 AM

ముప్ప

ముప్పు తప్పినా..

సాక్షి, అమలాపురం: మోంథా తుపాను పెను విపత్తు నుంచి జిల్లా బయటపడింది. తీరాన్ని చేరే వరకూ అత్యంత తీవ్రంగా వచ్చిన మోంథా.. తీరం చేరే సరికీ బలహీనపడింది. అయితే స్వల్పంగా వీచిన గాలులు, కొద్దిపాటి వర్షం అన్నదాత వెన్ను విరిచింది. కొబ్బరి రైతులకు ఊరట నిచ్చినా, వరి, అరటి రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. దీనితోపాటు రోడ్లు, విద్యుత్‌ శాఖకు నష్టం కలిగింది.

తగ్గిన గాలుల వేగం

మోంథా తుపాను బుధవారం తెల్లవారు జాము ఒంటి గంటకు జిల్లాకు సమీపంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్న ఈదురు గాలులు.. అదృష్టవశాత్తూ 50 కిలోమీటర్ల వేగానికే పరిమితమయ్యాయి. 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని చెప్పగా, కేవలం 14.9 మిల్లీమీటర్లు మాత్రమే పడింది.

కూలిన చెట్లు

తుపాను తీరం దాటే సమయంలో జిల్లాలో ఈదురుగాలులు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్ర వరకు సముద్ర తీరంలో 50 కిలోమీటర్ల వేగంతో వీచాయి. వాటి ధాటికి తీరంలో కొబ్బరి చెట్లు ఊగిపోయాయి. సముద్ర తీరంలో ఇసుక తుపాను తలపించింది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

మునిగిన వరి

వరి రైతులను మోంథా తుపాను ఎక్కువగా దెబ్బ తీసింది. భారీ వర్షాలు లేకున్నా రెండు రోజులుగా బలమైన ఈదురు గాలుల కారణంగా వెన్ను విరిగి నేలనంటాయి. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, 55,115 ఎకరాల్లో చేలు నేలకొరగా, 21,594 ఎకరాల్లో చేలు నీటమునిగాయి. మొత్తం 76,709 ఎకరాల్లో పంటపై తుపాను ప్రభావం చూపింది. గత అల్పపీడన వర్షాలకు తోడు, తుపాను కారణంగా మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునీరు చేలల్లో నిలిచిపోయింది. నీట మునిగిన చేలల్లో సగం చేలల్లో ఈ వారం, పది రోజులలో కోతలు మొదలు కావాల్సి ఉంది. తీర ప్రాంత మండలాలను ఆనుకుని ఉన్న అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో నీట నానుతున్న ధాన్యం రంగు మారడం, తప్పలు రావడం, మొలక రావడం జరుగుతుందని, దిగుబడి గణనీయంగా తగ్గుతుందని రైతులు వాపోతున్నారు.

అరటికి అధిక నష్టం

అంబాజీపేట, పి.గన్నవరం, కొత్తపేట, ఆలమూరు, రావులపాలెంలో మండలాల్లో అరటికి అధికంగా నష్టం జరిగింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు అరటి చెట్లు విరిగి పడ్డాయి. జిల్లాలో 4,667 మంది రైతులకు చెందిన 3,953.31 ఎకరాల ఉద్యాన పంటలు దెబ్బతినగా, 3,960 మంది రైతులకు చెందిన 3,379.90 ఎకరాల్లో అరటి నేలకొరిగింది. గెలలు కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోట నేలనంటడం వల్ల ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. 558 మంది రైతులకు చెందిన 450.71 ఎకరాల్లో కూరగాయలు, 45 మంది రైతులకు చెందిన 43.48 ఎకరాలలో బొప్పాయి, 62 మంది రైతులకు చెందిన 39.53 ఎకరాలలో పువ్వులు, 32 మంది రైతులకు చెందిన 19.76 ఎకరాల్లో పసుపు, పది మంది రైతులకు చెందిన 7.90 ఎకరాలలో తమలపాకు పంటలకు నష్టం వాటిల్లింది.

ముంచిన ఉప్పునీరు

సముద్రం చొచ్చుకు రావడంతో వశిష్ట నదీపాయ ద్వారా పోటెత్తి, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఏడవ వార్డును ముంచెత్తుతోంది. ఇక్కడ సుమారు 20 కుటుంబాలు ముంపుతో ఇబ్బంది పడుతున్నాయి. ఉప్పలగుప్తం మండలం పర్ర భూముల ద్వారా సముద్రపు నీరు వాసాలతిప్పలో మత్స్యకారుల ఇళ్లను తాకింది. వాసాలతిప్పతో పాటు ఎస్‌.యానాం బీచ్‌ రోడ్లను సముద్రపు నీరు నేరుగా ముంచుతోంది. కాట్రేనికోన మండలం పల్లం, బలుసుతిప్ప, మలికిపురం మండలం తూర్పుపాలెం, గొల్లపాలెం, కేశనపల్లిలోకి శంకరగుప్తం డ్రెయిన్‌ ద్వారా ముంపునీరు లోతట్టు ప్రాంతాలను ముంచుతోంది.

ఊపిరి పీల్చుకున్న కొబ్బరి రైతులు

1996 తుపాను వల్ల సుమారు 20 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగిన చేదు అనుభవాలతో కొబ్బరి రైతులు ఎక్కువగా భయపడ్డారు. గాలుల తీవ్రత 50 కిలోమీటర్ల లోపు ఉండడంతో చెట్లు విరిగిపోవడం తక్కువగా ఉంది. జిల్లాలో కేవలం 669 మంది రైతులకు చెందిన 950 చెట్లు విరిగి పడ్డాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతమైన అల్లవరం మండలం ఓడలరేవులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేసిన ఆయన ఓడలరేవులో దిగి బాధితులను పరామర్శించడంతో పాటు బెండమూర్లంకలో దెబ్బతిన్న వరి చేలను పరిశీలించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష జరిపారు. తుపాను ప్రత్యేకాధికారి విజయ రామరాజు, కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, ఎంపీ హరీష్‌ మాధుర్‌, ఎస్పీ రాహుల్‌ మీనా, జేసీ టి.నిషాంతి పాల్గొన్నారు.

జలదిగ్బంధంలో పల్లం గ్రామం

నష్టం మిగిల్చిన మోంథా

తీరంలో తగ్గని అలజడి

వరికి అంతులేని నష్టం

నేలనంటిన అరటి

కొబ్బరి తోటలకు ఊరట

పర్రభూముల్లోకి

చొచ్చుకు వచ్చిన సముద్రం

నీట మునిగిన మత్స్యకారుల ఇళ్లు

సగం పంట దెబ్బతింది

ఆలమూరు మండలం పినపళ్లలో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో సగానికి పైగా పంట దెబ్బతింది. దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. చేలల్లో ముంపునీరు వెంటనే తీయకుంటే నష్టం మరింత పెరుగుతుంది.

– అన్యం చంద్రరావు, కౌలురైతు

ముప్పు తప్పినా..1
1/2

ముప్పు తప్పినా..

ముప్పు తప్పినా..2
2/2

ముప్పు తప్పినా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement