
అదను దాటితే సుఖమేమి?
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరచారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బయట వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి వచ్చిన పంటలు విక్రయించి బాకీలు తీర్చారు. ప్రస్తుతం రెండో ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలై నెలరోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెట్టుబడి సాయం మాత్రం అందించలేదు. ఇప్పటికే రైతులు పెట్టుబడులు కోసం బయట వ్యాపారుల వద్ద అప్పులు చేసుకుని సాగు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం తమ వాటా రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేసేంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నగదుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చంద్రబాబు సర్కార్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ప్రకటించి రెండు నెలలైనా ఇంకా పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ప్రస్తుతం ఖరీప్ సాగు జోరదుంకుంది. జిల్లాలో ఈ ఏడాది 2.10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇప్పటికే సుమారు 60 వేల ఎకరాల్లో రైతులు వరినాట్లు సైతం వేసుకున్నారు. మరికొందరు రైతులు వరినారు సిద్ధం కావడంతో నాట్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం రైతులకు కూలీకి, దమ్ములు చేయించుకొనేందుకు పెట్టుబడి సాయం ఎంతో అవసరం. ప్రస్తుతం ఎకరా సాగు చేసే రైతుకు రూ.9 వేలు పైనే పెట్టుబడి అవసరం కానీ ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ కూడా ఆర్ధిక సహాయం లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోలసిన పరిస్థితి నెలకొంది. రైతులను చంద్రబాబు చిన్న చూపు చూస్తున్నారని, అందుకే గత ఏడాది అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయలేదని రైతులు మండిపడుతున్నారు.
1.70 లక్షల మందికి అందని సాయం
తాను అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పి గత ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదు. ప్రస్తుతం ఖరీప్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సహాయం మాత్రం అందలేదు. ఇప్పటికే గ్రామాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హుల జాబితా అయితే సిద్ధం చేశారు. పథకం మాత్రం అమలు చేయడం లేదు. గత ఏడాది జిల్లాలో రైతులకు రూ.340 కోట్ల మేర ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఈ ఏడాది ఎప్పుడు తమ ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడతాయా అని ఎదురుచూస్తున్నారు.
ప్రైవేటు వ్యాపారులే దిక్కు
ఈ ఖరీఫ్‌లో కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకపోవడంతో సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ప్రయివేటు వ్యాపారస్తులు వద్ద నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని పొలం పనులు చేసుకొంటున్నారు. దమ్ములు, ఎరువుల కొనుగోలు, వరినాట్లు వేసిన కూలీలకు కావాల్సిన డబ్బులు మొత్తం ప్రైవేటు వ్యాపారుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది వచ్చిన లాభమంతా వడ్డీలు కట్టేందుకే సరిపోయిందని, కనీసం ఈ ఏడాది అయినా ప్రభుత్వ సహాయం అందితే బాగుండునని రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
జగన్ హయాంలో ఆర్థిక భరోసా
ఖరీఫ్ సీజన్‌లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వం సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. దీనిలో కేంద్ర ప్రధానమంత్రి కిసా న్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7500 కలిపి మొత్తం రూ. 13,500 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేస్తూ వ చ్చింది. జిల్లాలో రెండు లక్షలకు పైగా ఉన్న రైతులకు ఈ ఐదేళ్లలో కేవలం ఈ పథకం ద్వారానే రూ.1121 కోట్లు లబ్ధి చేకూరింది. సంక్షేమ క్యాలెండర్‌లో చెప్పిన విధంగా రైతులకు క్రమం తప్పకుండా రైతు భరోసా నిధులు జమ చేశారు. ఖరీఫ్ రైతులు పెట్టుబడులు కోసం మే నెలలో మొదటి విడగా నిధులు జమ చేయడంతో రైతులు ఎంతో ఉత్సాహంగా సాగు చేసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనపించడం లేదు. గత ఏడాది మోసం చేసిన చంద్రబాబు ఈ ఖరీఫ్‌లో ఇంకా ఆ పథకం ప్రస్తావనే తేవడం లేదు. అదును దాటిన తర్వాత పెట్టుబడి సాయం అందించినా ఏమీ ఉపయోగం ఉండదని రైతులు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే రూ. 20 వేలు ఇవ్వాలి
ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 20 వేలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవ్వాలి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. గత ఏడాది ఇవ్వాల్సిన సహాయాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇకనైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
– ఎర్నీడి సత్తిరాజు, రైతు జి. మేడపాడు, సామర్లకోట మండలం
రైతులను మోసగించిన ప్రభుత్వం
ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకుండా రైతులను అన్ని విధాలా మోసం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు రైతు భరోసా నిధులు ఎప్పటికప్పుడు రైతులు ఖాతాల్లో జమచేశారు.
– నున్న వెంకటేశ్వరరావు, రైతు, విజయరాయుడుపాలెం, కరప మండలం
అన్నదాతా సుఖీభవ కోసం ఎదురుచూస్తున్న రైతుల వివరాలు
నియోజకవర్గం రైతులు
కాకినాడ రూరల్ 28,088
తుని 33,046
ప్రత్తిపాడు 39,581
పెద్దాపురం 17,345
జగ్గంపేట 30,036
ఖరీఫ్ పనులకు అందని సాయం
పెట్టుబడులకు అన్నదాత సతమతం
ప్రైవేటు రుణాలే దిక్కవుతున్న వైనం
అన్నదాతా సుఖీభవ విడుదలలో మోసం
గత ఏడాది రూ.340 కోట్లకు ఎగనామం

అదను దాటితే సుఖమేమి?

అదను దాటితే సుఖమేమి?