
జ్వాలాకు ఐదు స్వర్ణ పతకాలు
అమలాపురం రూరల్: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరర్ యూనివర్సిటీ నుంచి అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లికి చెందిన మోర్త జ్వాలా ఐదు స్వర్ణ పతకాలు సాధించింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఆమె బీఎస్సీ అగ్రికల్చర్ ఆనర్స్ చదివింది. అప్పట్లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమె ఒకేసారి ఐదు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. విజయవాడ గన్నవరంలో స్వర్ణ భారతి ట్రస్ట్‌లో గురువారం ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 57వ స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, వీసీ శారద, విశ్రాంత ఐఏఎస్ అధికారులు వేణుగోపాల్, ఎం.హరిజవహర్‌లాల్ చేతుల మీదుగా ఈ పతకాలను అందుకుంది. నీలంరాజు గంగా ప్రసాదరావు కమల, శ్రీపరి శాయానాది మెమోరియల్, మణియట్లపూడి మెమోరియల్, అంబేడ్కర్, రాజా ఇమ్మానియేల్ రాయల్ కొండేటి స్వర్ణ పతకాలతో సత్కరించారు. జ్వాలా తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా, తండ్రి ఐఈడీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జ్వాలా ప్రస్తుతం బెంగళూర్‌లోని ఐఐఎంలో ఏబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. జ్వాలాకు అధ్యాపక బృందం అభినందనలు తెలిపింది.
విధుల నుంచి తొలగింపు
అమలాపురం టౌన్: స్థానిక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ముగ్గురు ఒప్పంద సిబ్బంది అన్యమతస్తులుగా గుర్తించి దేవస్థానం ఈఓ యర్రా వెంకటేశ్వరరావు వారిని విధుల నుంచి తొలగించారు. దేవస్థానంలో స్వీపర్లుగా పనిచేస్తున్న కె.అనుషాదేవి, ఆర్.సుబ్బలక్ష్మి, స్కావెంజర్‌గా పనిచేస్తున్న కె.నాగేంద్రబాబులను విధుల నుంచి పూర్తిగా తొలగించారు. ఈ ముగ్గురు ఉద్యోగులు అన్యమతానికి చెందిన వారని చూపిస్తూ కొంతమంది భక్తులు ఫొటోలు, వీడియోలతో సహా దేవస్థానం ఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచి ఆ ముగ్గురిపై విచారణ నిర్వహించారు. వారు అన్యమత కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఫొటోలు, వీడియోలు ఉండడంతో విధుల నుంచి తొలగించినట్లు ఈఓ తెలిపారు.