
రైతులకు 11 అంకెల డిజిటల్ నంబర్
అమలాపురం రూరల్: అగ్రిస్టాక్ డిజిటల్ ప్లాట్‌ఫారం ద్వారా రైతులకు 11 అంకెల డిజిటల్ నంబర్‌ను కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. గురువారం అమలాపురం కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అగ్రిస్టాక్ ప్లాట్‌ఫామ్ విధి విధానాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ ఆధారిత సేవలను ఒకే తాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ పథకాలు అందించడం ఈ డిజిటల్ ప్లాట్‌ఫారం ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు తదితరులు పాల్గొన్నారు.
త్వరితగతిన సర్వే పూర్తి చేయండి
కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ జాయింట్ సర్వే ప్రక్రియను ఇటీవల కోర్టు తీర్పునకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. రైల్వే, రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడుతూ సర్వే పురోగతి, భూసేకరణ ప్రక్రియలో అడ్డంకుల పరిష్కార స్థితిగతులు, నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రైల్వే పాత, కొత్త అలైన్‌మెంట్‌ల ప్రకారం సర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ నిషాంతి, ఆర్డీఓలు కె.మాధవి, పి.శ్రీకర్, రైల్వే శాఖ గుంటూరు ఉప ముఖ్య ఇంజినీర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు
వచ్చే నెలలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. స్థానిక బాలయోగి స్టేడియంలో పెరేడ్ నిర్వహణ, జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందన్నారు.