
కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఆందోళన
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దళిత యువకుడు దోనిపాటి మహేష్‌పై అమలాపురం సమీపంలో జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు స్థానిక గడియార స్తంభం సెంటర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మాట్లాడారు. రాష్ట్రంలో పెచ్చుమీరిపోతున్న దాడులకు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే ముద్దు’ అనే నినాదాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు హోరెత్తించారు. బాధితుడు, దళిత యువకుడు చెప్పినట్లుగా దాడిలో ఉన్న 18 మంది అసలైన దోషులను పోలీసులు అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఉండ్రు బాబ్జీ, పినిపే జయరాజ్, కుంచే రమణారావు, ఎన్.శ్రీనివాసరావు, చింతా రామకృష్ణ, ఉండ్రు వెంకటేష్, నక్కా సంపత్, మల్లవరపు శ్రీను, రేవు శ్రీను, మెండు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అనుచరులను అరెస్ట్ చేయాలని ధర్నా
అమలాపురం రూరల్: దళిత యువకుడు దోనిపాటి మహేష్‌పై దాడి చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులను అరెస్ట్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు బుధవారం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ఽఆందోళన చేశారు. రౌడీలను పెంచి పోషిస్తున్న మంత్రి సుభాష్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దళిత యువకుడిని విచక్షణా రహితంగా కొడుతూ వీడియోలు తీసిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌పీఐ రాష్ట్ర నాయకుడు ఋషి, జిల్లా అధ్యక్షుడు చీకురుమెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాయల్ కాలేజీ అడ్డాగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మధ్యవర్తి దోనిపాటి మహేష్ ద్వారా అవిడి గ్రామానికి చెందిన రాజేష్ నుంచి రూ.రెండు లక్షలు తీసుకున్నారన్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వాలని మధ్యవర్తి మహేష్ అడగడంతో, డబ్బులు ఇస్తామని రప్పించి అల్లవరం మండలం గోపాయలంక, అమలాపురంలో నిర్మానుష్య ప్రాంతాలకు తిప్పి విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా కులం పేరుతో మంత్రి అనుచరులు దూషించారని అన్నారు. మంత్రి అనుచరుడు యల్లమెల్లి విజయ్, ఉదయ్‌శంకర్ ఈ దాడి చేశారన్నారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దేవరపల్లి ఏడుకొండలు, ఉచ్చుల సాల్మన్‌రాజు, బడుగు రాంబాబు, పంతగంటి నరసింహమూర్తి, బల్ల సత్యనారాయణ, మెండి కృష్ణబాబు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు