
వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి
అమలాపురం టౌన్: మోటారు సైకిళ్లపై కళాశాలలకు వచ్చే విద్యార్థులు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ విధిగా ధరించాలని అమలాపురం ఆర్డీఓ కొత్త మాధవి తెలిపారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి కళాశాలలో బుధవారం జరిగిన రహదారి భద్రతా అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) దేవిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాలలకు మోటారు సైకిళ్లు వేసుకుని వచ్చే విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలను ఆర్డీఓ వివరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలకు మోటారు సైకిళ్లపై వస్తే వారికి డ్రైవింగ్ లైసెన్స్‌లు, హెల్మెట్ ఉన్నాయా వంటి వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలు ఆరా తీయాలని సూచించారు. అలాగే తమ పిల్లలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రతా సందేశాన్ని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి సురేష్, కౌశిక్, విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏబీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సహాయ కార్మిక అధికారిగా
సుధామాధవి
అమలాపురం టౌన్: అమలాపురం కార్మిక శాఖ కార్యాలయంలో సహాయ కార్మిక అధికారిగా ఆదిమూలం సుధామాధవి బాధ్యతలు చేపట్టారు. ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధామాధవి పదోన్నతితో సహాయ కార్మిక అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలపై కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వారు తక్షణమే 94925 55058 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి