
సీట్ రైట్..
వసతులున్న కాలేజీలకే గుర్తింపు
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఆన్‌లైన్ ద్వారా కళాశాలల ప్రమాణాలు పరిశీలన చేసి అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ఆ మేరకు జేఎన్‌టీయూ కాకినాడ ఆన్‌లైన్‌లో తనిఖీలు నిర్వహించింది. సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించడంతో పాటు అన్ని వసతులు ఉన్న వాటికే గుర్తింపు ఇచ్చాం. అటువంటి కళాశాలలో అభ్యసిస్తే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
– డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూకే
● జేఎన్‌టీయూకే పరిధిలో సీట్లు ఖరారు
● ఇంజినీరింగ్‌లో 62 వేల సీట్లకు అనుమతి
● 2025–26లో 106 కళాశాలలకు గుర్తింపు
● ఉన్నత విద్యామండలికి నివేదిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ ప్రవేశాలల్లో వెబ్ ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. జేఎన్‌టీయూకే పరిధిలో సీట్ల ఖరారు పూర్తయ్యింది. తొలుత ఈ నెల 11వ తేదీని ప్రకటించగా, సీట్లు కొలిక్కి రాకపోవడంతో 13వ తేదీకి మార్చారు. రాష్ట్రంలోని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యామండలికి అందిస్తేనే.. అక్కడి నుంచి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక కళాశాలలకు అనుబంధంతో పాటు సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్‌టీయూకే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. వర్సిటీకి గతంలో పాత ఉమ్మడి జిల్లాలు 8 ఉండగా ఈ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలు తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కళాశాలలు అనుబంధంగా ఉన్నాయి.
బీటెక్‌లో 62 వేల సీట్ల భర్తీకి అనుమతి
2024–25 విద్యాసంవత్సరానికి కాకినాడ వర్సిటీ పరిధిలో అనుబంధంగా ఉన్న 106 కళాశాలల్లో 62 వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వీటితో పాటు ఈ ఏడాది కొత్తగా కృష్ణా జిల్లా ఏఎన్‌ఆర్, ప్రకాశం జిల్లాలో శ్రీహర్షిత కళాశాలకు గుర్తింపు లభించింది. బీటెక్ విభాగంలో గత ఏడాది దాదాపు 30 కళాశాలల వరకూ డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు కోసం 4 వేల సీట్లకు అనుబంధ కళాశాలలు దరఖాస్తు చేసుకోగా అక్కడి సౌకర్యాలు బట్టి వాటికి అనుమతి ఇచ్చారు. కొత్త కోర్సులైన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సులకు వెయ్యి సీట్లకు పైగా అనుమతి లభించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ మెయిన్స్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీటు సాధించలేకపోయిన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. వీరు ప్రైవేట్ వర్సిటీలతో పాటు ఏ గ్రేడ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఆన్‌లైన్‌లో కళాశాలల తనిఖీ
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు అనుబంధ కళాశాలల తనిఖీలను ఆన్‌లైన్‌లో చేపట్టారు. మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ కళాశాల పరిస్థితి, క్రీడా మైదానం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలన చేస్తారు. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్థారణ కమిటీ ఈ పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫారసు మేరకు ఏయే కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్థారణ కమిటీ సిఫారసులే కీలకం. ఈ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు.

సీట్ రైట్..