
రత్నగిరి.. భక్తజన ఝరి
అన్నవరం: స్థానిక సత్యదేవుని సన్నిధిలో వ్యాసపూర్ణిమ (ఆషాఢ పూర్ణిమ) వేడుకలను గురువారం నిర్వహించారు. దర్బారు మండపంలో వ్యాస మహర్షికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రాంగణంలో మూడు సార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం నీరాజనమంత్ర పుష్పాలు సమర్పించి ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం వేదపండితులు పాల్గొన్నారు. ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా వ్యాస పూర్ణిమ సందర్భంగా సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు వెయ్యి జరగ్గా, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వేల మంది భక్తులు నిత్యాన్నదాన పథకంలో స్వామివారి ప్రసాదం స్వీకరించారు.